ఓపెనింగ్ చెత్త.. మిడిల్ ఆర్డర్ పరమ చెత్త.. టెయిల్ ఎండర్లు మరీ చెత్త… ఇదీ టీమిండియా బ్యాటింగ్ పరిస్థితి. బౌలింగ్ విషయానికొస్తే, పేసర్లు.. స్పిన్నర్లు కలిసి కట్టుగా అతి చెత్త ప్రదర్శన ఇస్తున్నారు. ఫీల్డింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఓ వైపు వరల్డ్‌కప్ పోటీలు దగ్గరవుతుంటే, ఇంకోపక్క టీమిండియా వరుస వైఫల్యాలు భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ దారుణంగా కోల్పోయినా.. వన్డే సిరీస్ వుందిగా.. అనుకున్నవారికి, ధోనీసేన ట్రై సిరీస్‌లోనూ మరింత నిరాశనే మిగుల్చుతోంది. ఎక్కడ లోపం.? అని వెతకాల్సిన పనిలేదు. లోపం అన్ని విభాగాల్లోనూ స్పష్టంగా కన్పిస్తోంది.
ఫస్ట్ వన్డే ఆడిన రోహిత్, రెండో వన్డేలో ఆడకపోవడం.. బౌలర్లు రొటీన్‌గా చేతులెత్తేయడం, బ్యాట్స్‌మన్ కలసికట్టుగా విఫలమవడం.. వెరసి రెండో వన్డే విజయాన్ని ఇంగ్లాండ్‌కి పువ్వుల్లో పెట్టి ఇచ్చేసింది టీమిండియా. తొలి వన్డే ఇప్పటికే ఆస్ట్రేలియాకి టీమిండియా అర్పించేసిన విషయం విదితమే. సిరీస్‌లో టీమిండియా పుంజుకునే అవకాశాలు ప్రస్తుతానికైతే కన్పించడంలేదు.
‘మా బ్యాట్స్‌మన్ సరిగ్గా రాణించలేదు.. సరైన భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయాం..’ అని అన్నాడు కెప్టెన్ ధోనీ, మ్యాచ్ ఓడిపోయిన అనంతరం. అసలు ధోనీలోనే మునుపటి నాయకత్వ లక్షణాలు కన్పించడంలేదు. ఇలాగైతే టీమిండియా వరల్డ్‌కప్‌లో గట్టెక్కడం చాలా కష్టమైన విషయం. గట్టెక్కడమంటే తొలి రౌండ్‌ని పూర్తి చేయడం అన్నమాట. అనగా లీగ్ మ్యాచ్‌లను దాటడం.
గత వరల్డ్‌కప్ విజేత అయిన టీమిండియా, ఈ సారి వరల్డ్‌కప్‌కి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అడుగుపెడ్తోంది. బహుశా భారత క్రికెట్ అభిమానులు టీమిండియా ఇంత పేలవమైన ప్రదర్శన.. అదీ వరల్డ్‌కప్‌కి ముందు చూపిస్తుందని కలలో కూడా ఊహించి వుండరేమో.!