టాక్ తో సంబంధం లేకుండా సంక్రాంతి సీజన్ లో కలెక్షన్లు నొల్లేసుకుంది ఐ సినిమా. నిజమైనా కాకపోయినా, ఇప్పటికి అధికారికంగా అందించిన ప్రకటన ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20 కోట్ల షేర్ సాధించిందని తెలుస్తోంది. అయితే అంత మాత్రం చేత ఐ హిట్టేనా అంటే అనుమానమే.
ఎందుకంటే తెలుగు వెర్షన్ తీసుకున్నవారు 32 కోట్లు చెల్లించారు. మరో నాలుగు కోట్ల వరకు ఖర్చులు అయ్యాయని వినికిడి. ఆ రేంజ్ కు కాకున్నా, చాలా వరకు అమ్మకాలు సాగించారని, ఫరవాలేదనే పరిస్థితుల్లో వున్నారని అంటున్నారు. అంతమాత్రం చేత తెలుగు నిర్మాతలు గట్టెక్కినట్లు కాదు. ఇక ఉభయ రాష్ట్రాల్లో కొంతవరకు సినిమా అమ్ముడుపోయింది. అలా కొనుక్కున్నవారికి డబ్బులు రావాల్సివుంది. ఎవరికి అయితేనేం ముఫై ఆరు కోట్లు టార్గెట్ అనుకుంటే, ఇప్పటికి వచ్చింది 20 కోట్లే.
మంగళవారం మార్నింగ్ షోలు, మాట్నీలు డల్ అయ్యాయని వార్తలు అందుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఇంకో రెండు సినిమాలు రంగంలోకి వస్తున్నాయి. అప్పుడు కచ్చితంగా జనాలకు ఆల్టర్నేటివ్ దొరుకుతుంది. ఎంత లాంగ్ రన్ లో ఫిబ్రవరి మొదటి వారం వరకు చూసుకున్నా, కలెక్షన్లు మరో 20 కోట్ల మేరకు వస్తాయా అన్నది అనుమానంగానే వుంది.
అసలు ఐ కి వచ్చిన టాక్ కు ఈ కలెక్షన్లు రావడమే అబ్బురంగా వుంది. ఇదే సినిమా తెలుగు నిర్మాతలు, ఇదే మాదిరిగా తీసివుంటే, మనజనాలు ఎప్పుడో ఇంటికి పంపేసేవారు. మనవాళ్లు తమిళపుల్లకూర రుచి కాబట్టి, ఇప్పటికి 20 కోట్లు కుమ్మరించారు.