ఐపీఎల్ చట్టాలను అతిక్రమించి అనర్హతకు గురైన చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల కు ప్రత్యామ్నాయాల విషయంలో బీసీసీఐ అనేక ఆలోచనలు చేస్తోంది. మినిమం ఎనిమిదిజట్లలో ఐపీఎల్ ను నడపాల్సిఉంటుంది. బ్రాడ్ కాస్టర్ తో ఉన్న ఒప్పందం మేరకు ఎనిమిది జట్లను కొనసాగించాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో రెండు జట్లపై వేటు పడింది. వాటి విషయంలో ఇప్పటికిప్పుడు మళ్లీ వేలాన్నినిర్వహించి.. కొత్త ప్రాంచైజ్ ల ఎంపిక కంటే.. ప్రస్తుతానికి తాత్కాలికమైన ఏర్పాట్లు చేయడమే ఉత్తమం అని బీసీసీఐ భావిస్తోంది.
ఆ రెండు జట్లయాజమాన్య హక్కులనూ బీసీసీఐనే తీసుకోవడం.. వాటి నిర్వహణకు సంబంధించి లాభనష్టాలను తమే భరించడం.. ఆ జట్లలోని ఆటగాళ్లను యథాతథంగా కొనసాగిస్తూ.. వారికి బీసీసీఐనే డబ్బు ఇవ్వడం.. ఈ బాధ్యతలన్నింటీని మాజీ క్రికెటర్ల చేతిలో పెట్టడం. ఇదీ బీసీసీఐ ఆలోచన. మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ , గవాస్కర్ లను ఈ బాధ్యతల్లో వాడుకోవాలని బీసీసీఐ భావిస్తోందట.
వాళ్లకు రెండు జట్టనూ అప్పగించి… రెండేళ్ల పాటు బండిలాగించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. రెండేళ్లకు ఎలాగూ ఐపీఎల్ జట్ల యాజమాన్యాలుఅన్నీ మారిపోతాయి. అప్పుడు కావాలంటే ఫ్రెష్ గా వేలం పాటనిర్వహించుకోవచ్చు అని బీసీసీఐ భావిస్తోంది. మరి ఉన్నంతలో ఇది మంచి ఆలోచనలాగానే కనిపిస్తోంది. మాజీ ఆటగాళ్ల సేవలు ఈ విధంగా ఉపయోగించుకోవడం మంచిదే. మరి వివాదాలకు బాగా అలవాటు పడ్డ బీసీసీఐ ఈ ఆలోచనకు కట్టుబడి ఉంటుందా?!