ఆస్ట్రేలియా చేతిలో టెస్ట్ సిరీస్ పరాజయం పాలైన టీమిండియా, వన్డే సిరీస్‌లోనూ అదే పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా ‘ట్రై సిరీస్’ ఆడుతున్న విషయం విదితమే. అయితే టీమిండియా ఆటలో అరటిపండులా మిగిలిపోతే, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమిండియాతో ఓ ఆట ఆడుకుంటున్నాయి.
ఇప్పటికే సిరీస్ మీద పూర్తిగా ఆశలు సన్నగిల్లిపోయి, మిగిలిన ఒకే ఒక్క అవకాశాన్ని టీమిండియా ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాల్సి వుండగా, మిగిలినఒక్క ఛాన్స్‌నీ చేతులారా ఇంగ్లాండ్ కోర్ట్‌లోకి నెట్టేసింది. 200 పరుగులకే టీమిండియా చాప చుట్టేసింది. ఇక ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ ఫెయిల్ అయితే తప్ప టీమిండియా గెలిచే అవకాశాల్లేని పరిస్థితి.
ఓపెనర్ రహానే ఒక్కడే 73 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 38 పరుగులు చేస్తే, షమీ చివర్లో 25 పరుగులు సాధించాడు. అంబటి రాయుడు (12), ధోనీ (17) రెండంకెల స్కోర్ చేశామనిపించుకుంటే, బిన్నీ, జడేజా, కోహ్లీ, రైనా.. రెండంకెల స్కోర్ కూడా సాధించలేకపోయారు.
ఇంగ్లాండ్ బౌలింగ్ అద్భుతం.. అనడం కాదుగానీ, టీమిండియా బ్యాట్స్‌మన్ మరీ చెత్తగా బ్యాటింగ్ చేయడంతోనే ఈ దుస్థితి దాపురించింది. కొద్ది రోజుల్లోనే వరల్డ్‌కప్ పోటీలు జరగనుండగా, గత విజేతగా బరిలోకి దిగుతున్న టీమిండియా, అభిమానుల అంచనాల్ని అందుకోవడం కాదుకదా, లీగ్ దశలో ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
టైటిల్ సంగతి తర్వాత, వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్‌తో. ఇప్పటిదాకా వరల్డ్‌కప్‌లో టీమిండియాపై పాకిస్తాన్‌కి విజయం అనేది లేదుగానీ, ధోనీ సేన తాజాగా ప్రదర్శిస్తోన్న పేలవమైన ఆట తీరు చూస్తోంటే, వరల్డ్‌కప్‌లో టీమిండియాపై గెలిచే అవకాశాలు పాకిస్తాన్‌కి వున్నాయేమో అన్పించడంలేదూ.!