అద్భుతాలేం జరగలేదు. 201 పరుగుల టార్గెట్‌ని ఇంగ్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయినా తేలిగ్గానే గట్టెక్కేసింది. రాణించాల్సిన టైమ్‌లో చేతులెత్తేసిన టీమిండియా బౌలర్లు, ఇంగ్లాండ్‌కి విజయాన్ని పువ్వుల్లో పెట్టి మరీ అందించేశారు. ఓ దశలో ఐదు వికెట్లు కోల్పోయినా, ఇంగ్లాండ్.. భారత బౌలింగ్‌ని ఆ తర్వాత ధాటిగా ఎదుర్కొంది. ఇంగ్లాండ్ ఎదుర్కోవడమేమోగానీ, ఐదు వికెట్లు తీశాం.. ఇక చాల్లే అని భారత బౌలర్లు అనుకోవడంతో ఇంగ్లాండ్ పని సులువయ్యింది.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య జరుగుతోన్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో టీమిండియా ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. వరుస పరాజయాలతో ముక్కోణపు వన్డే సిరీస్ నుంచి టీమిండియా నిష్క్రమించింది. ఒక్క మ్యాచ్ వరుణుడి కారణంగా రద్దు కావడంతో, టీమిండియాకి పాయింట్లు దక్కాయేమోగానీ, లేదంటే అసలు టీమిండియా పేలవ ప్రదర్శన చూస్తే, ఫైనల్‌లో తలపడే జట్టులా ఎవరికీ అన్పించలేదు.
క్రికెట్ అనే కాదు, ఏ ఆటలో అయినా గెలుపోటములు సహజమే అయినా, గత కొన్నాళ్ళుగా టీమిండియా వైఫల్యాల్ని చూస్తే మాత్రం, ఇంతలా స్వయంకృతాపరాధం గతంలో ఎప్పుడూ టీమిండియా చేసుకోలేదని చెప్పొచ్చు. బ్యాట్స్‌మన్ ఫెయిలయినా బౌలర్లు ఫెయిలవుతున్నారు.. బ్యాట్స్‌మెన్ రాణించినా బౌలర్లు ఫెయిలవుతున్నారు. అలాగని పూర్తిగా బౌలర్ల మీదకు నెపాన్ని నెట్టేయలేం. అయితే టీమిండియా వైఫల్యంలో ప్రధాన భూమిక బౌలర్లదీ, ఓపెనర్లదీ, మిడిల్ ఆర్డర్‌దీ అన్నదాంట్లో మాత్రం సందేహాలు అనవసరం.
ఓ టెస్ట్ సిరీస్ పరాజయం.. ఓ వన్డే సిరీస్‌లో ఘోర వైఫల్యంతో.. టీమిండియా వరల్డ్‌కప్‌లోకి అడుగు పెడ్తోంది. ఇప్పటిదాకా టీమిండియా మీద ఏమన్నా అంచనాలున్నాయంటే, ఈ రోజుతో ఆ అంచనాలు పాతాళానికి వెళ్ళిపోయాయి.