ఇండియన్ స్పిన్నర్లు.. బ్యాట్ తో సత్తా చాటారు!

స్వదేశంలో జరిగే టెస్టు మ్యాచ్ లలో భారత్ విజయం పూర్తిగా స్పిన్నర్ల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించేది టీమిండియా స్పిన్ మంత్రాంగమే. ఇద్దరు స్పిన్నర్లు.. వీలైతే ముగ్గురు…

స్వదేశంలో జరిగే టెస్టు మ్యాచ్ లలో భారత్ విజయం పూర్తిగా స్పిన్నర్ల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించేది టీమిండియా స్పిన్ మంత్రాంగమే. ఇద్దరు స్పిన్నర్లు.. వీలైతే ముగ్గురు స్పిన్నర్లు అటాక్ చేస్తూ.. ప్రత్యర్థుల వెన్నుల్లో వణుకు పుట్టిస్తూ ఉంటారు.

ప్లేయర్లు మారారు…. కొత్త కొత్త స్పిన్నర్లు వచ్చి చేరారు కానీ.. అటాక్ మాత్రం అంతే స్థాయిలో ఉంటోంది. భారత్ పటిస్థితిలో ఉందన్నా, మ్యాచ్ గెలిచిందన్నా.. ఇండియన్ స్పిన్నర్లు తిప్పేశారనే అనుకోవాలి. వారి చెయ్యి తిరిగిందనే చెప్పాలి!

 మొహాలీ టెస్టులో కూడా టీమిండియా స్పిన్నర్ల చెయ్యి తిరిగింది కానీ.. ఈ సారి బాల్ తో కాదు, బ్యాట్ తో! టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అంతగా రాణించకపోవడంతో ఇబ్బందుల్లో పడిపోయిన జట్టును తమ బ్యాటింగ్ తో రక్షించారు స్పిన్నర్లు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్.. ముగ్గురూ హాఫ్ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ సాధించిన 283 పరుగులనైనా ఇండియా చేస్తుందా? అనే సందేహం ఉన్న దశ నుంచి ఏకంగా అత్యంత కీలకమైన 134 పరుగుల లీడ్ ను సాధించేంత వరకూ జట్టును తీసుకెళ్లారు స్పిన్నర్లు.

అశ్విన్ 72 పరుగులు, జడేజా 90 పరుగులు, జయంత్ యాదవ్ 55 పరుగులు చేశారు. బౌలర్లుగా జట్టులో ఉన్న వీళ్లు బ్యాట్ తో ఇంగ్లండ్ ఆధిపత్యానికి చెక్ చెప్పారు. 204 పరుగులకు ఆరు వికెట్లు పడిపోయిన దశ నుంచి ఇన్నింగ్స్ ను 417 పరుగుల వరకూ తీసుకురావడంలో అశ్విన్, జడేజా, యాదవ్ లు కీలక పాత్ర పోషించారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ ఆరు మంది చేసిన పరుగుల కన్నా.. వీరు ముగ్గురూ చేసిన  పరుగులే చాలా ఎక్కువ అని చెప్పాలి.

చేజారుతున్న మ్యాచ్ ను తిరిగి నిలబెట్టారు. స్పిన్నర్లు బంతితో గాక బ్యాట్ తో నిలబెట్టిన మ్యాచ్ గా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఇక ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ తో ఈ త్రయం కీలక పాత్ర పోషించనుంది.