ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక అంశాన్ని పట్టుకుంటే తొందరగా వదలరు. దానిపై విపరీతమైన ప్రచారం చేసి పీకి పాకం పెడతారు. కొన్నాళ్లుగా 'నగదు రహిత సమాజం' అనే అంశాన్ని పట్టుకున్నారు. రాష్ట్రంలోని మహిళలంతా మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించాలని, తద్వారా రాష్ట్రాన్ని నగదు రహితంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. మొబైల్ బ్యాంకింగ్‌లో శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని పేద మహిళలందరికీ (ప్రధానంగా డ్వాక్రా మహిళలు) మొబైల్ బ్యాకింగ్‌లో శిక్షణ ఇప్పించి దాని ద్వారానే బ్యాకింగ్ కార్యకలాపాలు నిర్వహింపచేసి, నగదు లావాదేవీలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మారుస్తారట….! ఈ విషయంలో దేశంలోనే రికార్డు సృష్టిస్తారట…! సత్తా చాటుతారట…! మహిళలందరూ మొబైల్ బ్యాంకింగ్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహించుకునేవిధంగా శిక్షణ ఇచ్చి రోల్ మోడల్‌గా నిలిస్తే దేశంలో ఇదొక చరిత్ర అవుతుందని బాబు సెలవిచ్చారు. స్మార్ట్ ఫోన్లు లేని వారందరికీ ప్రభుత్వమే ఫోన్లు కొనిస్తుందని చెప్పారు. డిసెంబరు నెలాఖరునాటికి మహిళలందరికీ మొబైల్ బ్యాంకింగ్‌లో శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నగదు రహిత సమాజం విషయంలో దేశంలోనే చరిత్ర సృష్టిస్తానని చెబుతున్న బాబుకు గోవా రాష్ట్రం ఆ అవకాశం లేకుండా చేయబోతోంది.
మొబైల్ బ్యాంకింగ్‌లో డిసెంబరు నెలాఖరునాటికి శిక్షణ ఇవ్వాలని బాబు డెడ్‌లైన్ పెట్టగా డిసెంబరు 31 నుంచి కేంద్ర పాలిత ప్రాంతమైన గోవా దేశంలోనే 'మొట్టమొదటి నగదు రహిత రాష్ట్రం' చరిత్ర సృష్టించనుంది. ఈ విషయం బాబు దృష్టికి పోయిందో లేదో తెలియదు. తెలిస్తే హతాశులవుతారేమో….! పెద్ద నోట్ల రద్దును పెద్ద విజయంగా భావించిన బాబు అందులో తనకూ వాటా ఉందని ప్రచారం చేసుకున్నారు. కాని ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అదే పనిగా దానిపై మాట్లాడితే వ్యతిరేకత వస్తుందని నాయకులు సలహా ఇచ్చారట. దీంతో గమ్మున ఉండిపోయారు.
ఈలోగా ప్రధాని మోదీ నగదు రహిత సమాజం గురించి మాట్లాడటం మొదలుపెట్టగానే దాన్ని అందిపుచ్చుకున్నారు. దీనిపై భారీగా ప్రచారం ప్రారంభించారు. దేశంలో తాను చరిత్ర సృష్టిస్తానంటూ ఆనవాయితీగా గొప్పలు చెప్పుకున్నారు. కాని చరిత్ర సృష్టించబోయేది గోవా రాష్ట్రం. డిసెంబరు 31 నుంచి ఈ రాష్ట్రంలో చేపలు, మాంసం, కూరగాయలు…ఇలా ఏ వస్తువైనా సరే నగదు లేకుండానే కొనుగోలు చేసుకోవచ్చు. వినియోగదారులు వారి మొబైల్ ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే చాలు.
వస్తువులు కొనుగోలు చేయడానికి డబ్బు అవసరం లేకపోవడమే కాకుండా జేబు దొంగల భయం కూడా ఉండదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్కె శ్రీవాస్తవ అన్నారు. నగదు రహిత కొనుగోళ్లు ఎలా చేయాలో తెలుసుకునేందుకు వినియోగదారులు ప్రభుత్వం ఇచ్చిన నెంబరుకు ఫోన్ చేయాలి. చేయగానే అనుసరించాల్సిన విధానం చెబుతారు. దాని ప్రకారం చేసుకుంటూ పోవడమే. తప్పనిసరిగా స్మార్ట్ ఫోనే ఉండాల్సిన అవసరం కూడా లేదట…! ఈ విధానంలో స్వైప్ మిషన్లు లేని చిన్న వ్యాపారులకు కూడా డబ్బు బదిలీ అవుతుందట…! నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు చిన్న దుకాణదారులకు, ప్రజలకు శిక్షణ ఇస్తారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. నగదు రహిత కొనుగోళ్ల పేరుతో నగదు సహిత లావాదేవీలు నిషేధించరు. నగదుతోనూ కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే క్యాష్‌లెస్‌గా వ్యవహరించడం అందరికీ అప్పుడే సాధ్యం కాదు కదా.
నగదు రహిత కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ఫీజులు వసూలు చేయబోమని ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ చెప్పారు. క్యాష్‌లెస్ సొసైటీ అనేది ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నమని, ఈ విషయంలో గోవాయే దేశంలో మొదటి రాష్ట్రంగా ఉండాలని మోదీ తనతో చెప్పారని గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పారీక్కర్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రజలందరికీ వారి మొబైల్ ఫోన్లే బ్యాంకులుగా మారుతాయన్నారు.
గోవా నగదు రహిత రాష్ట్రంగా మారడానికి ఇక్కడ ఉన్న అనుకూలాంశం తక్కువ జనాభా. ఈ రాష్ట్ర జనాభా 15 లక్షలు కాగా, 17 లక్షల ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. 22 లక్షల బ్యాంకు ఖాతాలున్నాయి. అంటే ఒక్కో వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలున్నాయన్నమాట. ప్రజల్లో ఎక్కుమంది డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. అత్యధికమంది కేవలం అక్షరాస్యులే కాకుండా బాగా చదువుకున్నవారు. కాబట్టి ఈ రాష్ట్రం నగదు రహితంగా మారడం అసాధ్యం కాదు. ఇది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి నగదు రహితమయ్యే మొదటి రాష్ట్రంగా చెప్పుకోవచ్చా?