సర్దార్ కు ఏం జరిగిందో..కాటమరాయుడికి అదే జరుగుతోందా? రోజు రోజుకు సినిమాలో పవన్ జోక్యం పెరిగిపోతోందా? పైగా వీలయినంత తక్కువ ఖర్చులో సినిమా నిర్మాణం పూర్తి చేయాలని, క్వాలిటీ దగ్గర రాజీ పడుతున్నారా? ఈ మేరకు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒక విధంగా కాటమరాయుడు రీహాబిలిటేషన్ ప్రాజెక్టు. సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల దారుణాతి దారణంగా నష్టపోయిన బయ్యర్లకు కాస్త తక్కువ రేట్లకు ఇవ్వడం కోసం కాటమ రాయుడు రెడీ చేస్తున్నారు. అలా తక్కువ రేట్లకు ఇవ్వాలి, అప్పుడు కూడా నిర్మాత కాస్త లాభం చేసుకోవాలి. పవన్ రెమ్యూనిరేషన్ యథావిధిగా వుండాలి అంటే, నిర్మాణం దగ్గర రాజీపడక తప్పదు. ఇప్పుడు అదే జరుగుతోందన్నది ఇండస్ట్రీ గుసగుసల సారాశం.
పైగా పవన్ తనకు సెట్ లో పరిస్థితులు నచ్చనపుడల్లా, మాయమవుతూ, మళ్లీ వస్తూ పోతూ వుంటున్నారని, సినిమా ఇలా కిందా మీదా అవుతోందని వదంతులు వినిపిస్తున్నాయి.
ఇటీవల హీరోయిన్ శృతి హాసన్ విషయంలో కూడా ఏదో చిన్న డిస్ట్రబెన్స్ వచ్చిందని వినిపిస్తోంది. కానీ అదేమిటన్నది ఇదమిద్దంగా తెలియడం లేదు. మొత్తం మీద కాటమరాయుడు వెనుక ఏదో జరుగుతోందన్న గుసగుసలు అయితే బలంగా వినిపిస్తున్నాయి.