ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ నుంచి చెన్నయ్ జట్టు మాయమైపోయింది. ఆ జట్టుకు చెందిన ఆటగాళ్ళకు ఇతర జట్లలో అకామడేట్ చేసేశారు. ఇదివరకటి కన్నా ఘనంగా ఐపీఎల్ కోసం ఆయా ఆటగాళ్ళకు భారీ స్థాయిలో ధర కూడా పలికేసింది. ఇంతకీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అవినీతి, అక్రమాలు, మ్యాచ్ ఫిక్సింగ్.. ఇవన్నీ మాయమైపోయినట్టేనా.? ఛాన్సే లేదు.
ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అవినీతి అందర్భాగమైపోయింది. మ్యాచ్ ఫిక్సింగ్ కూడా ఓ వ్యూహంగా మారిపోయింది. ఇవి కేవలం విమర్శలు మాత్రమే కాదు, మ్యాచ్‌లు జరుగుతున్న తీరు, ఆటగాళ్ళ పెర్ఫామెన్స్, ఆయా జట్ల వ్యూహాలు.. ఇవే కాదండోయ్, ఐపీఎల్ చుట్టూ జరుగుతున్న బెట్టింగ్.. ఇదంతా చూసినవారెవరికైనాసరే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ప్రతి సెషన్‌నీ పాత సెషన్ కన్నా అవినీతిమయంగా మార్చేస్తున్నారని అనిపించకమానదు.
ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా యంగ్ టాలెంట్‌ని దేశానికి పరిచయం చేయడం అనేది ముఖ్యమైన ఉద్దేశ్యం. కానీ, ఆ ఉద్దేశ్యం నీరుగారిపోయింది. బారత జట్టులో చోటు కొత్తగా దక్కించుకోవడం మాటెలా వున్నా, ఐపీఎల్‌లో ఆడితే, జట్టులో స్థానం కోల్పోవాల్సి వస్తుందేమోనన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ పేరుతో శ్రీశాంత్‌ని ఏకంగా క్రికెట్‌కి దూరం చేసేశారు. యువరాజ్‌సింగ్, గంభీర్, సెహ్వాగ్ లాంటి స్టార్లను ఐపీఎల్‌కి పరిమితం చేసేయడం గమనార్హమిక్కడ.
కొత్తగా కొంతమంది ఐపీఎల్ ద్వారా టీమిండియాలో చోటు దక్కించుకుంటున్నా, అలాంటివారి ద్వారా టీమిండియాకి కలుగుతున్న లాభమేమీ లేదు. ఒకప్పటి స్టార్స్‌ని రీప్లేస్ చేసే కొత్త స్టార్స్‌ని ఐపీఎల్ తీసుకురాలేకపోతోంది. ఐపీఎల్ ద్వారా ఏ మ్యాచ్‌కి ఆ మ్యాచ్ ఒక్కొక్కరు స్టార్స్ అవుతున్నారే తప్ప, కన్సిస్టెంట్‌గా టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటున్న ఆటగాళ్ళే దొరకని పరిస్థిథి నెలకొందిప్పుడు.
టాలెంట్ కొత్తగా రావడంలేదు.. దానికి తోడు అవినీతి ఆరోపణలు.. అయినాసరే, ఐపీఎల్ అంటే బీసీసీఐకి మోజు తగ్గడంలేదు. ఎందుకు తగ్గుతుంది.? ఐపీఎల్ ద్వారా కోట్లాది రూపాయలు బీసీసీఐ ఖజానాలో చేరిపోతోంటే. జెంటిల్‌మెన్ గేమ్ జూదంగా మారిపోయినాసరే, దానికి వున్న ఆదరణ మాత్రం అలాగే కొనసాగుతోంది. ఇక్కడ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ కన్నా, బెట్టింగ్ మీద మోజుతో ఎక్కువమంది ఐపీఎల్‌ని ఆదరిస్తున్నారంటే, ఐపీఎల్ పుణ్యమా అని క్రికెట్ ఏ స్థాయిలో బ్రష్టుపట్టిపోయిందో అర్థం చేసుకోవచ్చు.