మొత్తానికి ఇద్దరు ప్రముఖ వ్యాపార వేత్తలు ఇప్పుడు జైళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారిలో ఒకరు సహారా సంస్థ యజమాని సుబ్రతోరాయ్, డీసీ యజమాని తిక్కవరపు వెంకట్రామిరెడ్డి. వీళ్లిద్దరి వ్యవహారాలూ గత కొన్ని సంవత్సరాలుగా మీడియాలోచర్చనీయాంశాలే. సహార పరివార్ భారీ స్థాయిలో నిధుల సేకరణ చేపట్టడం వివాదమైంది. దీంతో రాయ్ జైలు పాలయ్యాడు. సేకరించిన డబ్బు ను సహారా రిటర్న్ చేయాలని కోర్టు ఆదేశించింది. అందుకోసం ఆస్తుల అమ్మకం ప్రక్రియ సఫలం కాకపోవడంతో రాయ్ కు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఆయన సంగతి అలా ఉంటే… డీసీ యజమాని కూడా జైలుకు వెళ్లాడు. చాలా రోజులుగా జరుగుతున్న వ్యవహారం ఒక కొలిక్కి వచ్చి వెంకట్రామిరెడ్డి జైలుకు వెళ్లడం జరిగింది. మరి ఈయన పరిస్థితి ఇంకా ఎక్కడి వరకూ వెళుతుందో అంతుబట్టడం లేదు. వందల కోట్ల వ్యవహారం కాబట్టి తిక్కవరపు ఎలా బయటపడతాడో చూడాల్సి ఉంది.
విశేషం ఏమిటంటే.. వీళ్లిద్దరూ ఐపీఎల్ టీమ్ లకు గతంలో ఓనర్లుగా వ్యవహరించిన వాళ్లే! వెంకట్రామిరెడ్డి డెక్కన్ చార్జెస్ టీమ్ కు ఓనర్ గాఉన్నాడు. అయితే అనూహ్యంగా డీసీ టీమ్ రద్దు అయిపోయింది. డీసీ హోల్డింగ్స్ ఆర్థిక ఇబ్బందులు అక్కడి నుంచినే మొదలయ్యాయి. ఇప్పుడు ఇక్కడి వరకూ వచ్చాయి.
ఇక సుబ్రతోరాయ్ పుణే టీమ్ ను కొనుగోలు చేశాడు. సహారా తరపున దానికి ఓనర్ గా నిలిచాడు. విశేషం ఏమిటంటే పుణే కూడా ఎక్కువ సంవత్సరాలు నిలబడలేదు. రెండు సీజన్లు అయినా సరిగా ఆడకముందే ఆ టీమ్ కూడా రద్దు అయిపోయింది. ఆ తర్వాత రాయ్ ను కష్టాలు చుట్టుముట్టాయి. ఆయన ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇలా రెండు ఐపీఎల్ టీమ్ ఓనర్లు జైలు వరకూ వెళ్లారు. ఇక మూడో ఆయన విజయ్ మాల్యా. ఈయన జైలుకు వెళ్లలేదు కానీ… బ్యాంకు డీఫాల్టర్ అయ్యాడు. దేశంలోనే పేరున్న వ్యాపార వేత్తగా ఒకవెలుగు వెలిగిన మాల్యా ప్రస్తుతానికి బ్యాంకు డీఫాల్టర్. గుర్రంలా దర్జాగా బతికే మాల్యాకు సంబంధించిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. వాటి నిర్వహణ విషయంలో మాల్యా అనేక ఇబ్బందులు పడుతున్నాడు.
ఐపీఎల్ కు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి ఉంది. ఈ లీగ్ లో టీమ్ ఓనర్లుకు కూడా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. వీరికి సినిమాతారలకు తీసిపోని గ్లామర్ లభించింది. అయితే ఇదే సమయంలో వీరిలో కొందరు ఆర్థిక ఇబ్బందుల్లోకూరుకుపోవడం. ఆర్థిక నేరాలతో జైళ్లకు కూడా వెళ్లడం జరుగుతోంది. మరి ఓడలు బళ్లు కావడం అంటే ఇదేనేమో!