ఐదు వన్డేల్లో నాలుగు వన్డేలను ఓడి, ఓ మ్యాచ్‌లో గెల్చుకుని పరువు నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది టీమిండియా, ఆస్ట్రేలియా టూర్లో. బ్యాటింగ్‌లో బలంగానే వున్నా, బౌలింగ్‌లో టీమిండియా వీక్నెస్ ఆస్ట్రేలియాలో కొంప ముంచేసింది. గెలవాల్సిన మ్యాచ్‌ల్లోనూ చేతులెత్తేయడంతో టీమిండియా, భారత క్రికెట్ అభిమానులనుంచి చాలానే విమర్శలెదుర్కొంది. దానికి బదులు తీర్చుకోవడానికి టీ20 మ్యాచ్‌లను ఉపయోగించుకుంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల్లో టీమిండియా వరుస విజయాల్ని నమోదు చేసింది. ఒకదాని తర్వాత ఒకటి.. ఒకదాన్ని మించి ఇంకోటి.. అన్నట్లుగా మ్యాచ్‌లు జరిగాయి. అన్నిటా టీమిండియాదే ఆధిపత్యం. బౌలింగ్ వీక్నెస్ కాస్తో కూస్తో కన్పించినా, ఓవరాల్‌గా టీమిండియా, కంగారూలతో ఓ ఆట ఆడుకుందనే చెప్పాలి. వన్డే సిరీస్, టీ20 సిరీస్‌లలో భారత బ్యాట్స్‌మెన్ సత్తా చాటడం, త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకి కలిసొచ్చే అంశమే.
బౌలింగ్ విషయంలో ఇప్పుడిప్పుడే మనోళ్ళు విదేశీ పిచ్‌లకు అలవాటు పడ్తున్న దరిమిలా, సరైన సమయానికి బౌలర్లూ ఫామ్‌లోకి వచ్చేయడం ఖాయమేనేమో అన్పిస్తోంది. అదే గనుక జరిగితే మరోమారు టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ని కైవసం చేసుకుంటుందన్నది నిర్వివాదాంశం.
రోహిత్ అదరగొట్టేస్తున్నాడు, శిఖర్ ధావన్ ఉతికేస్తున్నాడు, కోహ్లీ సంగతి కొత్తగా చెప్పేదేముంది, బౌలింగ్ లో ఆల్ రౌండర్ గా జడేజా సత్తా చాటేస్తున్నాడు.. ధోనీ మునుపటిలా కెప్టెన్సీలో జోరు చూపిస్తున్నాడు. వెరసి, కంగారూలతో టీమిండియా టీ20లలో ో ఓ ఆట ఆడుకుందనే చెప్పాలి. ఈ ఫామ్ టీమిండియా కొనసాగించాలని ఆశిద్దాం.