సినిమా రివ్యూ: కళావతి

రివ్యూ: కళావతి రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: గుడ్‌ సినిమా గ్రూప్‌, శర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ తారాగణం: సిద్ధార్థ్‌, సుందర్‌ .సి, త్రిష, హన్సిక, పూనమ్‌ బాజ్వా, వైభవ్‌, సూరి, కోవై సరళ, రాధారవి, మనోబాల…

రివ్యూ: కళావతి
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: గుడ్‌ సినిమా గ్రూప్‌, శర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌
తారాగణం: సిద్ధార్థ్‌, సుందర్‌ .సి, త్రిష, హన్సిక, పూనమ్‌ బాజ్వా, వైభవ్‌, సూరి, కోవై సరళ, రాధారవి, మనోబాల తదితరులు
సంగీతం: హిప్‌హాప్‌ తమిళ
కూర్పు: ఎన్‌.బి. శ్రీకాంత్‌
ఛాయాగ్రహణం: యు.కె. సెంథిల్‌ కుమార్‌
నిర్మాణం: గుడ్‌ ఫ్రెండ్స్‌
కథ, కథనం, దర్శకత్వం: సుందర్‌ సి.
విడుదల తేదీ: జనవరి 29, 2016

కొత్త హారర్‌ కామెడీ రాక కొన్ని వారాలయింది. ఈ జోనర్‌కి ఉన్న ఆదరణని బట్టి వారానికొకటి చొప్పున రాకపోవడం గొప్ప విషయమే. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఇప్పుడు హారర్‌ కామెడీని మించిన సేఫ్‌ బెట్‌ లేదు. ఖర్చు తక్కువ, జనాకర్షణ ఎక్కువ. కొత్తదనం కోరుకోరు, క్రియేటివిటీ ఆశించరు. అందుకే ఈ జోనర్‌ మీద కొందరు దర్శకులు కెరీర్లు నిలబెట్టుకుంటోంటే, కొందరు తమ కెరీర్లకి పునాదులు వేసుకుంటున్నారు. అలా ఈ జోనర్‌ని 'పిండుకుంటోన్న' దర్శకుల్లో సుందర్‌ సి. ఒకడు. 'అరన్మణయ్‌' (తెలుగులో చంద్రకళ) తమిళంలో ఘన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్‌ తీసాడు. తమిళంలో బ్రాండ్‌ నేమ్‌ని కొనసాగించగా, తెలుగులో కళావతి అనే కొత్త పేరు పెట్టారు. 

పేరు మారింది కానీ సుందర్‌ ఆలోచనల తీరు మారలేదు. అదే పెద్ద భవంతి, అందులో దెయ్యం, అక్కడున్న వాళ్లకి ప్రమాదం, విషయం గ్రహించినా కానీ పైకి చెప్పలేక కేకలు పెట్టే ఒక పిచ్చివాడి తరహా స్వామి, దెయ్యాన్ని చూసి భయపడ్డానికి కమెడియన్లు, దెయ్యంతో లింక్‌ వుంది అని భ్రమ పెట్టడానికి క్షుద్ర పూజలు చేసే ఒక నర్సు, ఏమైపోతాడో అని కలవర పడడానికో పిల్లాడు, దెయ్యం ఆచూకీ పట్టడానికి ఒక హీరోలాంటి క్యారెక్టరు, దెయ్యాన్ని తెచ్చి దిగ్బంధనం చేయడానికి ఒక కేరళ భూత వైద్యుడు, అతని వల్ల కూడా కాకపోతే మంచివాళ్లని దెయ్యం నుంచి కాపాడ్డానికి దేవి అవతారం, అది జరిగే ముందు వేప మండలు వేసుకుని ఒక బృందగానం. అసలు దెయ్యం ఎందుకు పగబట్టింది అని చెప్పడానికో ఫ్లాష్‌బ్యాక్‌. అది వీలయినంత హృదయవిదారకంగా మార్చడానికి, దెయ్యంతో సింపతైజ్‌ అవడానికి అప్పుడామె ప్రెగ్నెంట్‌! ఏంటిది సుందర్‌జీ… ఎన్ని సినిమాల్లో చూడని సరంజామా ఇది? హారర్‌ సినిమా అంటే ఇంతేనా? మీ రాష్ట్రానికే చెందిన యువకులు 'పిజ్జా', 'మాయ' అంటూ హారర్‌ సినిమా అంటే ఎలాగుండాలో చూపిస్తూ ఉంటే, ఇంకా నేల క్లాసు ఆడియన్సుని టార్గెట్‌ చేస్తూ అవే చందమామ కథలా? 

దెయ్యాలంటే చాలా మందికి భయం. దానికి వేరే వాళ్లు భయపడుతున్నప్పుడు మాత్రం వినోదం. జనంలోని ఈ ఒక్క వీక్‌నెస్‌ని క్యాష్‌ చేసుకుంటూ తామరతంపరగా ఇలాంటి సినిమాలు వచ్చి పడుతూనే ఉన్నాయి. కొందరైతే కనీసం దెయ్యానికి బ్యాక్‌డ్రాప్‌ అయినా మార్చి కాస్త కొత్తగా చూపిద్దామని ట్రై చేస్తున్నారు. సుందర్‌కి మాత్రం అంత ఓపిక లేదు. అందుకే తీసిన సినిమానే మళ్లీ తీస్తున్నాడు. చూసిన సినిమానే మళ్లీ చూడ్డానికి ఇబ్బంది లేని జనం ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పుడు దీనికీ మరో సీక్వెల్‌ తీయడానికి తగ్గట్టుగా ముగించాడు. ఇది కూడా మాస్‌ జనాలని థియేటర్లకి ఆకర్షిస్తోంది కనుక ఇంకోటి తీయాలనుకోవడం అతని తప్పు కాదు. 

దెయ్యానికి లాజిక్‌ లేదు కనుక తీసే సినిమాకి కూడా అక్కర్లేదనేది సుందర్‌ నమ్మకం అయి ఉండాలి. అందుకే అడిగేవాళ్లుండరనే ధైర్యంతో తనకి అనుగుణంగా ఆత్మ చేత ఆడించాడు. ఆత్మ రూపంలో తిరుగుతూ అనుకున్నది చేసేసే దెయ్యానికి సడన్‌గా ఒక శరీరం ఎందుకు అవసరమవుతుందో అర్థం కాదు. ఆత్మగా పగ తీర్చుకోవడం కష్టమైతే శరీరాల్లోకి దూరిందన్నా అర్థం. పైగా ఒక శరీరంలో బందీ అయిపోయి ఉన్నప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్లలేదు. నడిచి వెళ్లాలి లేదా కారులో వెళ్లాలి తప్ప ఎప్పుడంటే అప్పుడు మాయమై ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం కాలేదు. ఆ విధంగా తన పగ తీర్చుకునే కార్యక్రమం లేట్‌ అవడమే తప్ప ఒరిగేదేమీ లేదు. ఇద్దర్ని ఆత్మగానే ఖతం చేసి పారేసిన దెయ్యం మిగిలిన ఇద్దరిని చంపడానికి మరో శరీరంలో ఎందుకు దూరిందంటే, సుందర్‌ సర్‌ ఇష్టం మరి. క్వశ్చన్‌ చేయడానికి ఉండదు. ఏమీ లేని సినిమాని సాగదీయడానికి ఆయన పడ్డ తపన అంతా ఇంతా కాదు. తెరవెనుక ఉండి నడిపించడం కష్టమని అనుకున్నాడో ఏమో తెరమీదకే వచ్చేసి సిద్ధార్థ్‌ పనిని, చివరకు హీరోయిన్ల పనిని కూడా తనే చేసేసాడు. టాలెంటెడ్‌ యాక్టర్‌ సిద్ధార్థ్‌ని ఇందులో చూస్తే అయ్యో అనిపిస్తుంది. గందరగోళంతో కూడిన ఒక ఎక్స్‌ప్రెషన్‌ని నిలకడగా మెయింటైన్‌ చేస్తూ ఉంటే, అది క్యారెక్టరైజేషన్‌ పరంగా పెట్టినదో లేక సుందర్‌ ఏం తీస్తున్నాడనేది అర్థం కాక కెమెరా ముందు కూడా ఆ అయోమయాన్ని దాచలేకపోయాడో అర్థం కాదు. 

దెయ్యం క్యారెక్టర్‌తో కాసేపు నువ్వు భయపెట్టావు కదా, ఇప్పుడు కాసేపు తను ఆ గెటప్‌ వేస్తుందంటూ త్రిష, హన్సికల మధ్య ఒక ఒప్పందం కుదిర్చినట్టున్నాడు. ఇంతసేపు మీరు దెయ్యాలుగా కనిపించారు కదా, ఇప్పుడు క్లయిమాక్స్‌లో నా వంతు అంటూ సుందర్‌ తనే దెయ్యంగా మారినట్టున్నాడు. చేతిలో పెన్నుంది, క్వశ్చన్‌ చేయడానికి దర్శకుడు కూడా లేడు. రెండూ తనే కాబట్టి, తన ఇష్టం వచ్చిన రీతిన 'కళావతి'ని రింగ్‌ మాస్టర్‌లా ఆడించాడు. నల్ల కళ్ల దెయ్యం, తెల్ల కళ్ల దెయ్యం ఇలా రకరకాల రూపాలు మారుస్తూ క్లయిమాక్స్‌ని సాగదీస్తూ కాలక్షేపం చేసాడు. సెన్స్‌ ఉన్న వారికి 'ఏంటిది సిల్లీగా' అనిపిస్తుంది. దెయ్యం తెరపై కనిపిస్తే వణికిపోతూ, దాన్ని చూసి వణికేవాళ్లని చూస్తే నవ్వేసేవాళ్లకి టైమ్‌పాస్‌ అయిపోతుంది. 

తిమ్మిని బమ్మిని చేసినా కానీ ఇందులో విషయం తక్కువే అనే సంగతి సుందర్‌కి తెలియక కాదు. అందుకే వీలయినన్ని క్యారెక్టర్లని, చాలా మంది తెలిసిన ముఖాలని పెట్టి తెర నింపేసాడు. హీరోయిన్లతో అందాల ప్రదర్శన చేయిస్తూ గ్లామర్‌ పరంగా లోటు రాకుండా చూసుకున్నాడు. హారర్‌ సినిమా అంటే బేసిక్‌గా జనాన్ని భయపెట్టేది. కళావతి అది తప్ప అన్నీ చేస్తుంది. బి, సి సెంటర్ల ప్రేక్షకుల నుంచి ఈ మసాలా అంశాలకి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. పైగా హారర్‌ అనేది ఇప్పుడు సేలబుల్‌ ఇన్‌గ్రీడియంట్‌ కనుక ఈజీగా పాస్‌ అయిపోతుంది. కమర్షియల్‌గా సేఫ్‌ అయిపోవచ్చు కానీ సినిమాగా మాత్రం కళావతికి కళ లేదు. కేవలం జోనర్‌ని క్యాష్‌ చేసుకునే ప్రయత్నమే తప్ప ప్రేక్షకులని థ్రిల్‌ చేయాలనో, హారర్‌ సినిమా చూసిన ఫీల్‌ ఇవ్వాలనో అస్సలు ఎటెంప్ట్‌ చేయలేదు. 

బోటమ్‌ లైన్‌: కళావతిని చంద్రకళ 2 లేదా చంద్రముఖి 20… ఎలా పిలుచుకున్నా ఒక్కటే!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri