బహిరంగ శృంగారం అనాలో, ఇంకేమన్నా అనాలోగానీ.. విరాట్ కోహ్లీ చేసిన పనిపై క్రికెట్ ప్రేమికులు విస్తుపోతున్నారు. మాజీ క్రికెటర్లు కోహ్లీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కోహ్లీ ప్రతిభావంతమైన ఆటగాడే అయినా, క్రికెట్ నిబంధనల్ని గౌరవించకపోవడం వల్ల తనంతట తానుగా తన కెరీర్‌కి మచ్చ తెచ్చుకుంటున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిన్న ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ తలపడింది బెంగళూరు జట్టు. బెంగళూరు ఆటగాడైన కోహ్లీ, ఆట వర్షం కారణంగా నిలిచిపోయిన సమయంలో తన ప్రియురాలు, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో రొమాన్స్‌లో మునిగిపోయాడు. మాటా మంతీ సంగతెలా వున్నా, అనుష్క నడుమ్మీద చెయ్యేసి, దగ్గరకి లాక్కుని.. కోహ్లీ చేసిన రొమాన్స్ వివాదాలకు తావిచ్చింది.
మ్యాచ్ సందర్భంగా ఇలాంటి చర్యలు క్రమశిక్షణా ఉల్లంఘన కిందకు వస్తాయంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. కోహ్లీ అభిమానులు సైతం తమ అభిమాన క్రీడాకారుడు ఇలాంటి పనులు చేయడాన్ని జీర్ణించుకోలేక తమ ఆవేదనను సోషల్ మీడియాలో వెల్లగక్కుతున్నారు. మరోపక్క బీసీసీఐ సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.