మొత్తానికి దేశంలోని వ్యాపారవేత్తలెవరైనా ఐపీఎల్ టీమ్ ను కొనుగులు చేయాలని భావిస్తుంటే.. ఒకసారి వారు తమ జాతకాన్ని చూపించుకొంటే మంచిదనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే.. ఈ లీగ్ లో జట్లను కొనుగోలు చేసిన వారిలో చాలా మంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. కొంతమంది జైలు పాలయ్యారు. జైళ్లలోనే ఉన్నారు! మరి వాళ్లకు తగిన ఎదురుదెబ్బలకు ఐపీఎల్ ప్రమేయం లేకపోయినా… వాళ్లు ఎప్పుడో చేసిన పొరపాట్ల వల్ల వివాదాలు తలెత్తి ఉన్నా.. వరసగా ఐపీఎల్ ప్రాంచైజ్ ఓనర్లు ఇబ్బందులు పడుతుండటం మాత్రం విశేషమే!
పూణే వారియర్స్ జట్టును కొనుగోలు చేసి..దాన్ని నిలబెట్టుకోలేకపోయిన సుబ్రతో రాయ్… కొన్ని సీజన్ల పాటు డెక్కన్ చార్జర్స్ ను నడిపిన టి.వెంకట్రామిరెడ్డిలు ప్రస్తుతం జైళ్లలో ఉన్నారు. వేరు వేరు ఆర్థిక ఇబ్బందుల ఫలితంగా వీరు జైళ్లకు వెళ్లారు.ఇక కోచి టీమ్ కోన్నాడు మాజీ కేంద్ర మంత్రి శశిధరూర్ ప్రియురాలు సునంద పుష్కర్ కూడా కష్టాలపాలై. ఆఖరికి హత్యకు గురైంది.
ఇక బెంగళూరు రాయల్ చాలెంజర్స్ యజమాని విజయ్ మాల్యా కొన్ని బ్యాంకుల చేత ఇన్ సాల్వెంట్ పర్సన్ గాప్రకటించ బడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్ యజమానికి ఆర్థికంగా ఎలాంటి కష్టనష్టాలూ లేవు కానీ.. స్పాట్ పిక్సింగ్ లో అల్లుడి ప్రమేయం వల్ల కోర్టుల చేత మొట్టికాయలు తింటున్నాడు. బీసీసీఐ అధ్యక్ష పదవికి అర్హత కోల్పోయాడు.
ఇప్పుడు సన్ గ్రూప్ వాళ్ల వంతు వచ్చింది. వీరు ఐపీఎల్ లో హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సన్ రైజర్స్ కు యజమానులు. సన్ గ్రూప్ కు యజమాని అయిన కళానిధి మారన్ సన్ రైజర్స్ కు ఓనర్ గా ఉన్నాడు. ఈయన సోదరుడు దయానిధి మారన్ గతంలో కేంద్రమంత్రిగా ఉన్నాడు.
అప్పట్లో జరిగిన ఎయిర్ సెల్ -మ్యాక్సిస్ ఒప్పందంలో దయానిధికి డబ్బు ముట్టిందని.. అది మారన్ ల గ్రూప్ లోకి పెట్టుబడిగా వచ్చిందని ఆరోపణ. ఈ విషయంలో తాజాగా వీరి ఆస్తుల అటాచ్ మెంట్ జరిగింది. త్వరలో కళానిధి, దయానిధిల అరెస్టు కూడా జరగవచ్చని తెలుస్తోంది. మరి అదే జరిగితే సన్ రైజర్స్ యజమాని కూడా జైలు పాలైనట్టవుతుంది!