‘అరుంధతి’ అనుష్క ఎప్పుడు పెళ్ళి పీటలెక్కుతుందోగానీ, ఇంకో అనుష్క పెళ్ళి పీటలెక్కడానికి రెడీ అయిపోయింది. క్రికెటర్ విరాట్ కోహ్లీతో గత కొన్నాళ్ళుగా డేటింగ్‌లో వున్న బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీని పెళ్ళాడనుంది. తమ కుమారుడి పెళ్ళి విషయం మాట్లాడేందుకు ఇప్పటికే విరాట్ కోహ్లీ తల్లిదండ్రులు అనుష్కని కలిశారట. అనుష్క తల్లిదండ్రులతోనూ చర్చలు జరుపుతున్నారట.
అన్నీ కుదిరితే అతి త్వరలోనే విరాట్ కోహ్లీ, అనుష్క వైవాహిక బంధంతో ఒక్కటి కానున్నారని ఇటు క్రికెట్ వర్గాల్లోనూ, అటు బాలీవుడ్ సినీ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతోంది. చాలాకాలంగా అనుష్క, విరాట్ మధ్య ప్రేమాయణం నడుస్తోంది. మొదట్లో ఖండించినా, ఆ తర్వాత తమ మధ్య డేటింగ్ వాస్తవమేనని విరాట్, అనుష్క కొన్నాళ్ళ క్రితమే ప్రకటించేశారు.
ఇటీవలే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలు కాగా, ఆ మ్యాచ్‌ని తిలకించేందుకు ఆస్ట్రేలియా వెళ్ళిన అనుష్కపై క్రికెట్ అభిమానులు గుస్సా అయ్యారు. అనుష్క వల్లనే ఆ మ్యాచ్‌లో విరాట్ వైఫల్యం చెందాడనీ, అదే టీమిండియా ఓటమికి కారణమని కొందరు అభిమానులు ఆరోపించారు. బాలీవుడ్‌తోపాటు, సినీ ఇండస్ట్రీ కూడా అనుష్కకు మద్దతుగా నిలిచిందనుకోండి.. అది వేరే విషయం.
విరాట్, అనుష్క పెళ్ళి వ్యవహారమిలా వుంటే, మరో క్రికెటర్ సురేష్ రైనా పెళ్ళి కూడా ఖాయమైంది. అతి త్వరలోనే రైనా ఓ ఇంటివాడు కానున్నాడు. దక్షిణాదికి చెందిన ఓ హీరోయిన్ తో రైనా ఆ మధ్య క్లోజ్‌గా మూవ్ అయినా, ఆ నటిని టాటా చెప్పేసి రైనా, పెద్దలు కుదర్చిన, తాను ఇష్టపడిన ఇంకో అమ్మాయిని పెళ్ళాడుతున్నాడు.