అందాలు ఆరబోసి అవకాశాలు సంపాదించుకొంటారు…
ఆ క్రీములు పట్టించుకోండి.. తెల్లబడతారు, అబ్బాయిలు మీ వెంటబడతారు అంటూ సౌందర్యలేపనాలకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు…
సినిమాల్లో అయితే హీరోల వెంట పడుతూ తమ కంటూ ఒక క్యారెక్టర్ లేని అమ్మాయిల పాత్రలనే చేస్తారు…
అంతిమంగా స్త్రీ సాధికారత గురించి లెక్చర్లు దంచి కొడతారు!
వివాహంతో సంబంధం లేని శారీరక సంబంధాలు స్త్రీ సాధికరతకు నిదర్శనం అంటూ… నయా ఫిలాసఫీ చెబుతారు బాలీవుడ్ నటీమణి దీపికా పదుకొనే!
వివాహానికి పూర్వమే సెక్స్ అంటూ ఇది వరకూ కొంతమంది సెలబ్రిటీలు స్పందించారు. ఆ వివాదాలను ఎవరూ మరవకముందే దీపిక చేసిన వ్యాఖ్యానాలు ఇప్పుడు కొత్త వివాదాలను సృష్టిస్తున్నాయి. ఈమె స్త్రీ సాధికారత గురించి మాట్లాడుతోంది! వివాహంతో సంబంధం లేని సెక్స్ అనేది స్త్రీ సాధికారికతకు నిదర్శనమని చెప్పుకొస్తోంది.
ముందుగా వచ్చే సందేహం ఏమిటంటే.. బాలీవుడ్ నటీమణులకు స్త్రీ సాధికారికత గురించి మాట్లాడే అర్హత ఉంటుందా?! అనేది! ఎందుకంటే.. ముందుగా స్త్రీలను అవమానించేది వీళ్లే! స్త్రీని మార్కెటింగ్ ప్రోడక్ట్ గా మార్చడంలో బాలీవుడ్ నటీమణులది ముఖ్యపాత్ర.
జిడ్డు చర్మంతో ఉంటే.. అమ్మాయిల కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని యాడ్స్ లో చెబుతారు ఈ హీరోయిన్లు! మరి ఆ మాట ఎంత మంది అమ్మాయిల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది? తాము చెప్పే ప్రోడక్టులను వాడేస్తే.. సమాజంలో అమ్మాయిలకు గౌరవమర్యాదలు దక్కుతాయని ఈ హీరోయిన్లు టీవీ యాడ్స్ లో చెబుతారు! ఇక సినిమాల్లో వీరి వేషాలకు అయితే కొదవే ఉండదు. మగాడిని ఆకట్టుకోవడమే పనిగా ఎంతకైనా తెగించే పాత్రల్లో కనిపిస్తారు హీరోయిన్లు!
నిజంగానే దీపిక లాంటి వాళ్లు స్త్రీ సాధికరికతను కోరుకొంటే.. స్త్రీ ఆత్మగౌరవం నిలబడాలి అంటే.. పై చర్యలకు దూరంగా ఉండాలి. అమ్మాయిలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే యాడ్స్ లో చేయకూడదు.. అలాంటి వేషాలను మానేయాలి. అవి మానేయలేని వీళ్లకు స్త్రీ సాధికారకత గురించి మాట్లాడే అర్హత ఉండదు.
ఆ అర్హతేలేని నటమణులు వివాహంతో సంబంధం లేని సెక్స్ ఉమెన్ ఎంపర్ మెంట్ కు నిదర్శనం అంటూ మాట్లాడేస్తున్నారు తమకు మించిన మేధావులు లేరన్నట్టుగా! ఇదే మాటే ఎవరైనా మగాడు మాట్లాడితే.. మహిళా జనోద్దరకులు ఎలా విరుచుకుపడే వారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తను తెగించాలనుకొంటే దీపిక తెగింవచచ్చేమో కానీ.. ఇలాంటి పిచ్చి ఫిలాసఫీలు చెప్పడం మానుకొంటే మంచిది.