ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణోత్సవం

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలో కోదండరాముడి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. తొలిసారి ఈ దేవాలయంలో అధికారికంగా కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఒంటిమిట్టను…

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలో కోదండరాముడి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. తొలిసారి ఈ దేవాలయంలో అధికారికంగా కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఒంటిమిట్టను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, గవర్నర్‌ నరసింహన్‌ సాయంత్రం జరిగే కోదండరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. గత నెలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీరామనవమినాడు ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలోగల శ్రీరామతీర్థం పుణ్యక్షేత్రంలో రాములోరి కళ్యాణ వేడుకల్ని వైభవంగా నిర్వహించిన విషయమే. అదే రోజు ఒంటిమిట్టలో బ్రహోత్సవాలు ప్రారంభమయ్యాయి.

చారిత్రక ప్రాధాన్యత వున్న ఒంటిమిట్ట దేవాలయంలో కళ్యాణోత్సవాలు శ్రీరామనవమి రోజు జరగవు. పైగా రాత్రివేళ చంద్రుడి సమక్షంలో రాములోరి కళ్యాణోత్సవాలు జరగడం విశేషమే. చంద్రుడి కోరిక మేరకు శ్రీరాముడు, సీతాదేవిని వెన్నెల వెలుగుల నడుమ పెళ్ళాడతానని హామీ ఇచ్చారనీ, అందుకే ఒంటిమిట్టలో రాత్రిపూట కళ్యాణం జరుపుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు.

ఇక, ఒంటిమిట్ట పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఒంటిమిట్ట ఎత్తి పోతల పథకం, ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం నిర్వాసితులైనవారికి ఇళ్ళ నిర్మాణాలకు సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేస్తారు. జాతీయ ఆరోగ్య భద్రత పథకాన్నీ చంద్రబాబు ఒంటమిట్టలోనే ప్రారంభిస్తారు.