అప్పట్లో ఇండియా-ఇజ్రేల్ దౌత్యసంబంధాలు వింతగా వుండేవి. రష్యాకు సన్నిహితంగా వుండే ఇండియా ప్రభుత్వం ఇజ్రాయేలు ఉనికిని గుర్తించ నిరాకరించింది. దేశస్థాయిలో ఏ సంబంధాలూ పెట్టుకోకపోయినా బొంబాయిలో వున్న 20 వేల మంది యూదుల పాస్‌పోర్టు, వీసాల జారీ కోసం బొంబాయి సిటీతో మాత్రం ఇజ్రాయేలుకు దౌత్యసంబంధాలుండేవి. అక్కడ ఒక దౌత్యాధికారి (కాన్సల్ జనరల్) వుండేవాడు. అతను యీ అప్లికేషన్ల ప్రాసెసింగ్‌కై అతను తరచు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చేది. కానీ అలా వెళ్లాలంటే బొంబాయి అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇజ్రాయేల్ జాతీయ దినోత్సవం జరుపుకోవాలి అతిథులను పిలిచి పార్టీ చేసుకుంటాం అంటే ఏ హోటలూ గది యిచ్చేది కాదు. ఏదో స్కూలులో బాస్కెట్‌బాల్ కోర్టులో చేసుకోవలసి వచ్చేది. ఊళ్లో వున్న యూదులకు, ఖుశ్వంత్ సింగ్, రామ్ జెఠ్మలానీ వంటి ముగ్గురు నలుగురు నగరప్రముఖులకు తప్ప ఆ అధికారి యితరులకు అంటరానివాడిగానే వుండేవాడు. వినోద్ ''సండే అబ్జర్వర్'' ఎడిటరుగా వుండే రోజుల్లో కాన్సల్ జనరల్‌గా యూసెఫ్ హసీన్ వుండేవాడు. అప్పుడప్పుడు పార్టీల్లో ఎదురైతే ''మీ ఇండియా పత్రికా స్వేచ్ఛ వుందంటారు. ఒక్క జర్నలిస్టూ నన్ను కలిసి నా కష్టాలేమిటని అడిగిన పాపాన పోలేదు. నాతో యింటర్వ్యూ చేస్తే వాళ్ల ఉద్యోగాలు పోతాయని భయం పాపం'' అని వెక్కిరించేవాడు. ఓ రోజు వినోద్ తెగించి ''ఓకే నేను మిమ్మల్ని యింటర్వ్యూ చేసి అచ్చేస్తాను. ఏమౌతుందో చూద్దాం.'' అన్నాడు.
ఆ ఇంటర్వ్యూలో హసీన్ భారత ప్రభుత్వాన్ని, రాజకీయనాయకులను తూర్పారబట్టాడు. ''ఇక్కడి ప్రజలకు ఇజ్రాయేలుపై ద్వేషం ఏమీ లేదు, మేమంటే ఆరాధన, ప్రేమ కూడా వున్నాయి. కానీ రాజకీయనాయకులు మాత్రం మేమంటే చికాకు ప్రదర్శిస్తారు, ఎందుకంటే వాళ్లకు అరబ్బులంటే భయం. ఢిల్లీలో అరబ్-ముస్లిం లాబీ గట్టిగా పనిచేస్తూ వుంటుంది. మా దేశానికీ, మీ దేశానికి దౌత్యసంబంధాలు ఏర్పడకుండా నిరంతరం కృషి చేస్తూ వుంటుంది.'' అని దుమ్ము దులిపేశాడు. చివరకు 1992లో అలాటి బంధాలు ఏర్పడుతాయన్నది అప్పటికి తెలియదు కదా. ఈ ఇంటర్వ్యూ బయటకు రాగానే మహారాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి, కాంగ్రెసు నాయకుడు రఫీఖ్ జకారియా మండిపడ్డాడు. ఆఫ్టరాల్ యింత చిన్న ఉద్యోగి, పోనీ కదాని వుండనిస్తున్న భారతప్రభుత్వంపై ధ్వజం ఎత్తేటంతటి మొనగాడా? ఎంత పొగరు, ఎంత కండకావరం, ఎంత మదం అని ఢిల్లీలో అందరూ రంకెలు వేసేటట్టు చేశాడు. దేశమే కాదు, అంతర్జాతీయంగా కూడా యిది చర్చకు వచ్చింది. ఇంటర్వ్యూ యిచ్చిన రెండు వారాలకు హసీన్‌ను దేశం నుండి 48 గంటల్లో విడిచి వెళ్లాలని ఉత్తర్వు వేశారు. వెళ్లబోతూ వినోద్‌ను యింటికి పిలిచి పార్టీ యిచ్చాడు. ''నాకు ఏ చింతా లేదు, ఉన్న వాస్తవాలేమిటో అందరికీ చెప్పి వెళుతున్నాను. మా ప్రభుత్వం కూడా ఏమీ అనుకోలేదు. నన్నేమీ దండించదు.'' అన్నాడు. వినోద్‌కూ చింత లేదు. తన పేపరు గురించి అందరికీ తెలిసింది.
పేపరుకు రీడర్‌షిప్ పెరిగినకొద్దీ ఎడిటరును మంచి చేసుకునేందుకు కార్పోరేట్ వర్గాలు ప్రయత్నిస్తాయి. ఒకరోజు వినోద్‌కు ధీరూభాయ్ అంబానీ ఆఫీసు పిఆర్‌ఓ నుండి ఫోన్ వచ్చింది. ''సాబ్ మీతో పాలిటిక్స్ గురించి మాట్లాడతారట. ఆయన ఆఫీసుకి రమ్మన్నారు. రేపు మీకు కుదురుతుందా?'' అని. ''కలవడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ, మీ ఆఫీసులో ఎందుకు, ఏ తాజ్ హోటల్లోనే అయితే బెటరు కదా'' అన్నాడు వినోద్. నలుగురి కంటా పడేట్లు రమ్మంటున్నాడు, వీడేదో తిక్కరకంలా వున్నాడే అనుకుని పిఆర్‌ఓ మళ్లీ కాల్ చేయలేదు. తనకే యిలాటి ఆఫర్ వచ్చిందంటే దేశంలో కల్లా శక్తివంతమైన పేపరు టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటరు గిరిలాల్ జైన్‌కు ఎన్ని వచ్చి వుంటాయో అని ఆలోచించాడు వినోద్. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇందిరా గాంధీనే కాదు, ధీరూభాయ్ అంబానీని కూడా వెనకేసుకుని వచ్చేది. ఒక పక్క గోయెంకా ''ఇండియన్ ఎక్స్‌ప్రెస్'' అంబానీ తప్పుల్ని భూతద్దం వేసి కనిపెడుతూ వుంటే వాళ్ల తప్పేమీ లేదంటూ గిరిలాల్ వ్యాసాలపై వ్యాసాలు రాసేవాడు. వినోద్ టీమ్ వెతగ్గా వెతగ్గా ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ 'ఎఫ్' సీరీస్ డెబెంచర్స్ 3000ను గిరిలాల్‌కు ఎలాట్ చేసినట్లు తెలిసింది. అవి కొనడానికి అతనికి బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండ్ కామర్స్ నుంచి ఋణం కూడా యిప్పించాడు. ఆ విధంగా పైసా పెట్టుబడి పెట్టకుండా గిరిలాల్ ఆ రోజుల్లోనే (1985) రూ.30 లక్షలు సంపాదించాడు. వ్యాపారస్తులు ఎడిటర్లను ఎలా ప్రలోభపెడుతున్నారో తెలిపే యీ ఆధారం దొరకగానే వినోద్ తన పత్రికలో ప్రచురించేశాడు. విపరీతంగా రెస్పాన్సు వచ్చింది. ఇది నిజమా అని అడిగితే ధీరూభాయ్, గిరిలాల్ నోరు విప్పలేదు.
వినోద్ కృషి వలన సండే అబ్జర్వర్ పేపరుకు ఖ్యాతితో బాటు యాడ్స్ కూడా పెరిగాయి. నాలుగు, ఒక్కోప్పుడు ఎనిమిది పేజీల కలర్ సప్లిమెంటు యాడ్స్‌కోసం జోడించేవారు. ఢిల్లీ ఎడిషన్ కూడా మొదలుపెట్టారు. కొత్త కొత్త జర్నలిస్టులు, చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేసే రిపోర్టర్లు వచ్చి చేరారు. పేపరుకు యింకా ఎదిగే శక్తి వుంది. భారీ ఎత్తున పెట్టుబడి పెడితే యింకాయింకా పైకి వెళుతుంది. కానీ అశ్విన్‌కు ఆ ఉద్దేశం లేదు. రిస్కెందుకు, చిన్నసైజు పేపరుగానే వుంచి వస్తున్న లాభాలతోనే తృప్తి పడదాం అనుకున్నాడు. ఇంకా ఎదగాలని జాతీయస్థాయిలో తన ప్రభావం చూపాలని ఆశ పడుతున్న వినోద్ మనస్తత్వానికి యిది వ్యతిరేకం. అందుకే రేమాండ్ గ్రూపు వారి ''ఇండియన్ పోస్టు''కు ఎడిటరుగా ఆఫర్ వస్తే తరలి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయాక ''సండే అబ్జర్వర్''కు రాహుల్ సింగ్ ఎడిటరుగా వచ్చాడు. క్రమేపీ దాని ప్రభ తగ్గిపోయింది. రెగ్యులర్‌గా కొనే నేను కూడా కొనడం మానేశాను. కొంతకాలానికి అశ్విన్ అంబానీలకు అమ్మేశాడు. వాళ్లు కొన్నేళ్లు నడిపి మూసేశారు.
వినోద్ తర్వాతి ప్రయత్నం గురించి చెప్పబోయే ముందు కొన్ని విషయాలు – శీర్షిక పేరు మార్చమని ఒక పాఠకుడిచ్చిన సలహా చూశాను. వారికి నా మనవి – శీర్షిక తర్వాతి భాగంలో వినోద్ మెహతా వున్నా, వినోద్ ఖన్నా వున్నా, హర్షద్ మెహతా వున్నా ముందు భాగంలో నా పేరు వుందని గమనించండి. ఈ వెబ్‌సైట్‌లో వేరే రచయిత విషయంలో యిలా వుంటుందా? నేను వ్యాసాలు రాసిన యితర చోట్లా యిలా వుండదు. దీనికి మాత్రమే ఎందుకిలా అంటే – యివి కబుర్లు, దీని డిజైనే యింత! ఏం చెప్పినా కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం యింకొంత అన్నట్లు నా దృక్కోణాన్ని కలిపే చెప్తా. ఆఖరికి బైబిల్ కథల సీరియల్లో కూడా నా అధికప్రసంగం వుంటుంది చూడండి. వ్యాసాలకైతే ఒక ఫార్మాట్ వుంది. వీటిని వ్యాసాలనడానికి లేదు (వీటికి ఏం పేరు పెట్టాలో తెలియక ఏకవచనంలో ప్రస్తావించవలసి వచ్చినపుడు అప్పుడప్పుడు వ్యాసం అంటున్నా), కాలమిస్టులెవరూ పాఠకులతో యింత యింటరాక్షన్ కోరుకోరు, స్పందించరు, నాలా అప్పుడప్పుడు బోనెక్కి సంజాయిషీలు వినిపించరు. నేనే అవధానిని, నేనే అప్రస్తుత ప్రసంగిని, ఏదో చెపుతూ వేరెక్కడికో వెళతాను, పాఠకుడికి తెలిసో లేదో అని వివరాలు చెప్తాను. ఎందుకంటే నేను మౌలికంగా పాఠకుణ్ని, యితరులతో నా భావాలు, గుర్తుకు వచ్చిన సంగతులు పంచుకుంటున్నాను. దట్సాల్! గత ఏడాది చేసిన యూరోప్ టూరు ట్రావెలోగ్ రాద్దామనుకున్నాను, నెపోలియన్ తల్లి రోమ్‌లో నివసించిన గది కిటికీ సంగతి (ఫ్రెంచాయన తల్లి ఇటలీలో వుండడమేమిటి?) డిగోల్ (వేరేలా పలకాలని అక్కడకి వెళ్లాకే తెలిసింది). ఫాష్ విగ్రహాల సంగతి రాద్దామనుకుని వాళ్ల గురించి తెలియని పాఠకుల సంగతేమిటి అన్న ప్రశ్న వేసుకుని ఆగిపోయాను. చెప్పగలిగితే వాళ్ల జీవిత విశేషాలతో సహా కలిపి చెప్పాలి, చెప్పకపోతే అది టూరిస్టు లిటరేచర్‌లా తయారవుతుంది. టైముంటేనే రాయాలి, లేకపోతే వూరుకోవాలి అనుకున్నాను.
నేను ఏం చెప్పినా మన తెలుగు జీవితాలకు, మనకు తెలిసిన వ్యక్తులకు ముడిపెడుతూ కబుర్లు చెప్తాను. వినోద్ కథలో నిస్సిమ్ ఎళికిల్ గురించి, నీరద్ చౌధురీ పేర్లు ప్రస్తావించి వదిలేస్తే ఎంతమందికి ఎక్కుతుందో నాకు డౌటు. ఇటీవల చార్లీచాప్లిన్ ఆత్మకథ తెలుగులో చదివాను. కాస్తో కూస్తో హాలీవుడ్‌తో పరిచయం వున్న నాకే తెలియని పాత్రలెన్నో తగిలాయి. ఏది యింటిపేరో, ఏది అసలు పేరో, ఎవరు ఆడో, ఎవరు మొగో, ఎవరు యాక్టరో, ఎవరు డైరక్టరో, ఎవరు నిర్మాతో వాళ్ల గుణగణాలు ఏమిటో ఏమీ తెలియలేదు. అనువాదకర్త ఫుట్‌నోట్‌లోనైనా వివరించలేదు. పుస్తకం పూర్తి చేసేసరికి తాతలు దిగివచ్చారు. ఇలాటి అవస్థ నా సహపాఠకులు పడకూడదనే లక్ష్యంతోనే అన్నీ విపులంగా, వివరంగా పెర్శనల్ టచ్‌తో రాస్తున్నాను. జనాలు చదువుతున్నారు. ఎందుకు? చిన్నపుడు హరికథ కంటె, దానిలో చెప్పిన పిట్ట కథలే నచ్చేవి, బుఱ్ఱకథ థీమ్ కంటె హాస్యగాడే ఎక్కువ నచ్చేవాడు. నా పాఠకులకూ అంతేనేమో. పిజి ఉడ్‌హౌస్ నవలను ఒక సమీక్షకుడు ఘాటుగా విమర్శించాడు. 'పాత కథే, పాత్రల పేర్లు మాత్రం మార్చాడు' అని. తర్వాతి నవలలో ఉడ్‌హౌస్ ఆ విమర్శను ప్రస్తావిస్తూ 'పాత కథనే, పాత్రల పేర్లు మార్చకుండా దీన్ని రాస్తున్నాను…' (బాపుగారు యీ జోక్ చెప్పేటప్పుడు '..వ్వెవ్వెవ్వే'అని జోడిస్తారు) అని ఢంకా బజాయించి పుస్తకాన్ని మార్కెట్లోకి వదిలాడు. ఆ నవలనూ ఆయన పాఠకులు ఆదరించారు. ఆయన నవలల తీరంతే! జానపద సినిమాలో హీరో మారువేషంలో విలన్‌ను చావబాదుతూ మధ్యలో మీసం తీసి ప్రేక్షకుల కేసి చూసి కన్నుకొట్టాడనీ, దాంతో ఔచిత్యం పోయిందని, సహజత్వం దెబ్బతిందని ఫిర్యాదు చేస్తే ఎలా? స్వాష్‌బక్లింగ్ హీరో అంటే అంతే! ఎమ్బీయస్ కబుర్లు కూడా పోచికోలు కబుర్లతో, సొంతగోలతో నడుస్తుంది. ఇలాటి స్వోత్కర్ష, చొరబాట్లు లేని నా సీరియస్ వ్యాసాలు, కథలు కావాలంటే 10 పుస్తకాలు మార్కెట్లో వున్నాయి. అవి చదవవచ్చు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)