పసికూన ఐర్లాండ్ చేతుల్లో ఓడిపోయిన వెస్టిండీస్, వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌కి చుక్కలు చూపించింది. ఆల్రెడీ పాకిస్తాన్, టీమిండియా చేతిలో పరాజయం చవిచూసిన విషయం విదితమే. వెస్టిండీస్ చేతిలో తాజాగా ఓడిన పాకిస్తాన్ ‘పూల్`బి’లో పాయింట్ల పరంగా అట్టడుగు స్థానానికి చేరింది.
క్రైస్ట్‌చర్చ్‌లో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాళ్ళు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమిష్టిగా రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది వెస్టిండీస్. ఏ దశలోనూ పాకిస్తాన్ బౌలర్లు, వెస్టిండీస్ బ్యాట్స్‌మన్‌ని నిలవరించలేకపోయారు. క్రిస్ గేల్ తప్ప మిగతా ఆటగాళ్ళంతా రెండంకెల స్కోర్ సాధించారు. రామ్‌దిన్, సిమ్మన్స్ మాత్రమే అర్థసెంచరీలు చేసినా, సమిష్టిగా రాణించి భారీ స్కోర్ సాధించిపెట్టారు వెస్టిండీస్ ఆటగాళ్ళు తమ జట్టుకి. చివర్లో కేవలం 13 బంతుల్లో నాలగు భారీ సిక్సర్లు బాది 42 పరుగులు చేశాడు రస్సెల్.
311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆటగాళ్ళు ఆదినుంచే చేతులెత్తేశారు. కేవలం ఒక్క పరుగుకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. చివర్లో మసూద్, అక్మల్ రాణించడమొక్కటే పాకిస్తాన్‌కి ఊరట. వారిద్దరూ అర్థ సెంచరీలు నమోదు చేస్తే, ఆఫ్రిది 28 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్ళలో ముగ్గురు డకౌట్లుగా వెనుదిరగ్గా, ఆ మిగిలినవారిలోనూ ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. బ్యాట్‌తోనూ, బాల్‌తోనూ మ్యాజిక్ చేసిన రస్సెల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
39 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయి, పాకిస్తాన్ భారీ పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోవడం ఓ చెత్త రికార్డ్. అది పాకిస్తాన్ మూటగట్టుకుంది ఈ మ్యాచ్ ద్వారా.