విశాఖపై మెగాస్టార్ చూపు

ఇక్కడే స్థిరపడతానంటున్న చిరంజీవి సినిమాలపైనే ధ్యాస రాజకీయాల ఊసెత్తని వైనం Advertisement మొత్తానికి మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు అంటే విరక్తి కలిగినట్లుంది. దాదాపు ఆరేళ్ల పాటు రాజకీయ జీవితం గడిపిన ఆయన తనకు బతుకు…

ఇక్కడే స్థిరపడతానంటున్న చిరంజీవి
సినిమాలపైనే ధ్యాస
రాజకీయాల ఊసెత్తని వైనం

మొత్తానికి మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు అంటే విరక్తి కలిగినట్లుంది. దాదాపు ఆరేళ్ల పాటు రాజకీయ జీవితం గడిపిన ఆయన తనకు బతుకు ఇచ్చిన సినిమాలే బెస్ట్ అని నిర్ణయానికి వచ్చేశారు. అంతే కాదు, రాజకీయాల వైపు చూడడానికే ఇష్టపడడంలేదు. మహాశివరాత్రి సందర్బంగా విశాఖపట్నం ఆర్‌కె బీచ్‌లో కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు టి సుబ్బరామిరెడ్డి నిర్వహించిన మహా కుంభాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి తన పూర్వపు శైలిలోనే మాట్లాడడం పలువురికి ఆసక్తిని కలిగించింది. 

ఎక్కడా రాజకీయ వాసన లేకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. అంతే కాదు, సినిమాల గురించే ఆయన ఎక్కువగా ప్రస్తావించారు. ప్రజారాజ్యం పార్టీ స్ధాపించి తన మూడు దశాబ్దాల అభిమానంతో ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపైనే గురి పెట్టి భంగపడిన చిరంజీవి అనంతర కాలంలో ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా రెండేళ్ల పాటు పనిచేసిన సంగతి విధితమే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా భారీ స్ధాయిలో ఓటమి పాలు కావడం, విభజించిన పాపానికి ఏపీలో సోది లోకి లేకుండా పోవడం తెలిసిన సంగతే. 

ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది తరువాత చిరంజీవి తన మనసులోని మాటలను విశాఖ జనంతో పంచుకున్నారు. విశాఖ అందాలను పొగిడేశారు, తనకు సినీ జన్మ నిచ్చిన ప్రాంతంగా కొనియాడారు. తన సినిమా కెరీర్ మొదటి రోజులలో విశాఖలోనే అనేక సినిమాలు చేశానని కూడా ఆయన చెప్పుకున్నారు. అభిలాష, ఛాలెంజ్ వంటి సినిమాలు ఇక్కడే చిత్రీకరించబడి మహత్తర విజయాన్ని అందుకున్నాయని కూడా ఆయన చెప్పారు. 

విశాఖ అంటే తనకు ఎనలేని అభిమానమని, ఇక్కడ ప్రజలు చాలా మంచివారని కూడా కితాబు ఇచ్చారు. తన సినిమా జీవితానికి విరమణ అంటూ ప్రకటిస్తే తాను విశాఖలోనే స్థిరపడతానని కూడా ప్రకటించారు. ఈ ప్రకటనతో మెగాభిమానులలో ఆనందం వెల్లివిరిసింది. సినిమా జీవితం ఇంకా ముగియలేదన్న సంకేతాన్ని కూడా చిరంజీవి ఇచ్చినట్లయింది. ఈ మధ్యకాలంలో 150వ చిత్రం చేస్తానని చిరంజీవి ఊరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ సినిమా ఉంటుందా లేదా అన్న అభిమానుల సందేహాలకు మెగాస్టార్ మహా శివరాత్రి వేళ సమాధానం ఇచ్చారు. 

తాను సినిమా జీవితానికి కామా మాత్రమే పెట్టానని, పుల్‌స్టాప్ పెట్టలేదని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో సినీ జీవితం ముగిస్తే విశాఖలో స్ధిరపడతానంటూ ఆయన చేసిన ప్రకటన ద్వారా రాజకీయాలకు ఇక ద్వారాలు మూసేసినట్లేనన్న సంకేతాన్ని కూడా ఇచ్చారు. ఇది ఇంకా అభిమానులలో ఆనందాన్ని నింపింది. నిజానికి చిరంజీవి అభిమానులలో మెజారిటీ సెక్షన్‌కు ఆయన రాజకీయాలలోకి రావడం ఇష్టంలేదు. అయితే, వచ్చిన చిరంజీవి అక్కడ ఇమడలేక సైడ్ క్యారెక్టర్‌లో సర్దుకోవడం కూడా వారికి అంతగా రుచించలేదు. 

మొత్తానికి మహా శివరాత్రి వేళ భోళా శంకరుడిలా చిరంజీవి విశాఖ ప్రజానీకాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం యావత్తు చిరు అభిమానులకు సంతోషాన్ని కలిగించిందనే చెప్పాలి. కాగా, చిరంజీవి సన్నిహితుడు, విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కొనసాగుతున్న సంగతి విధితమే. ఈ సభలో ఆయన కూడా ఉండడం విశేషం. మెగాస్టార్ కుటుంబ మిత్రుడైన గంటా విశాఖ రాజకీయాలను శాసిస్తున్నారు. రానున్న రోజులలో విశాఖలో సినిమా స్డూడియోను చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నిర్మిస్తారన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో చిరంజీవి విశాఖలోనే స్థిరపడతానని చేసిన ప్రకటనకు ఎనలేని ప్రాధాన్యత చేకూరింది. 

ఇక, వర్తమాన రాజకీయాలను చూసినా చిరంజీవి సమీప భవిష్యత్తులో ఇటు వైపు చూసే అవకాశాలు లేనే లేవని చెప్పకతప్పదని రాజకీయ పండితులు అంటున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ టీడీపీ ఉంది, 2019 నాటికి కూడా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమంత మారుతుందన్న ఆశ కాంగ్రెస్ వర్గాలలో లేదన్నది నిజం. చిరంజీవి టీడీపీ రాజకీయాలలో ఇమడలేరు, అలాగని బీజేపీలో చేరుతామనుకున్నా ఏపీలో ఆ పార్టీ పరిస్థితి పెద్దగా లేని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టడమే శ్రేయస్కరమని చిరంజీవి భావిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. 

రాజకీయాలలో కేంద్ర మంత్రి స్ధాయి వరకూ వెళ్లామన్న సంతృప్తితో చిరంజీవి ఉన్నారని, 2018 వరకూ ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఢోకా లేదని అంటున్నారు. ఆ తరువాత ఆయన పూర్తిగా సినిమాల వైపే ఉంటారని, అందువల్లనే కాంగ్రెస్ రాజకీయాలలో ఆయన అతిథి పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే చిరంజీవి మళ్లీ వెండి తెరపై కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది చిరంజీవి మాటలలోనే రుజువైంది, ఇది మెగాభిమానులకు నిజంగా శుభవార్తే.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం,