కరోనా ప్రభావంతో అంతర్జాతీయంగా క్రీడల మీద కూడా ప్రభావం పడుతూ ఉన్న సంగతి తెలిసిందే. టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ జరుగుతాయా? అనేది ఇంకా సందేహంగానే ఉంది. బిగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే.. వాటికి జనసందోహం ఏ స్థాయిలో కలుస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. ఒలింపిక్స్ అంటే.. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి అథ్లెట్లు వస్తారు. అలాగే వీక్షకులు కూడా. అదో క్రీడా పండగ. అలాంటి చోట కరోనా వైరస్ వ్యాపించేస్తుందనే భయాందోళనలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒలింపిక్స్ జరుగుతాయా, లేదా అనేది ప్రస్తుతానికి ఇంకా సందేహమే.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీనేమో.. అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయని అంటోంది. నిర్వహించాల్సిన జపాన్ మాత్రం ఇంకా స్పష్టత లేదని అంటోంది. ఆ సంగతలా ఉంటే.. దేశీయ ఐపీఎల్ జరుగుతుందా? అనేది మరో సందేహం. కరోనా నేపథ్యంలో ఈ సారి ఐపీఎల్ నిర్వహణపై కూడా నీలినీడలు అలుముకున్నాయి. ఐపీఎల్ క్రౌడ్ అంటే అదే స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. కరోనా భయాల నేపథ్యంలో ఈ లీగ్ నిర్వహణ ఉంటుందా? అనే సందేహాలపై స్పందించారు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.
ఈ సారి కూడా లీగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని సౌరవ్ తేల్చి చెప్పారు. వివిధ దేశాల్లో క్రికెట్ సీరిస్ లు జరుగుతున్నాయని, అవి ఆగలేదు కాబట్టి.. ఐపీఎల్ కూడా ఆగదని ఆయన తేల్చి చెప్పారు. అయితే కరోనా నేపథ్యంలో.. అంతర్జాతీయ ఆటగాళ్లు ఎవరైనా ఆడలేమని అంటే లీగ్ కళ తప్పవచ్చు. అలాగే లీగ్ ప్రారంభం వరకూ కరోనా భయాలు ఇలానే ఉంటే, ప్రేక్షకులు మైదానాలకు వచ్చి చూసే అవకాశాలు తగ్గవచ్చు. టీవీలో చూసే అవకాశం ఉండనే ఉంది కాబట్టి.. దానికే చాలా మంది పరిమితం కావొచ్చు.