క్రికెటర్ శ్రీశాంత్ పుత్రికోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఇటీవలే శ్రీశాంత్ దంపతులకు ఓ కుమార్తె జన్మించింది. కూతురు వచ్చిన వేళా విశేషం వల్ల తనకు క్రికెట్ కెరీర్లో అన్నీ శుభాలే కలుగుతాయని శ్రీశాంత్ ఆశిస్తున్నాడు. మీడియా ముందుకొచ్చి, పుత్రికానందాన్ని పంచుకున్న శ్రీశాంత్, టీమిండియాలో మళ్ళీ చోటు సంపాదించుకోవాలని ఆశిస్తున్నాననీ, ఆ కల త్వరలోనే నెరవేరుతుందనే నమ్మకం తనకుందని చెప్పాడు.
చిన్న వయసులోనే క్రికెట్లో అరంగేట్రం చేసి, కొన్ని సంచలనాలైతే నమోదు చేశాడుగానీ, తక్కువ కాలంలోనే కెరీర్ని అటకెక్కించేసుకున్నాడు. సహచరులతో గొడవలు, వాటితోపాటు ఫిక్సింగ్ వివాదాలతో శ్రీశాంత్ కెరీర్ని చెడగొట్టుకున్నాడు. వాస్తవానికి ఇందులో శ్రీశాంత్ తప్పిదం తక్కువే. కానీ, జట్టులోని ఇతర సభ్యులతో సఖ్యతగా వుండకపోవడమే శ్రీశాంత్ని ఇప్పుడీ దుస్థితిలోకి నెట్టేసిందని చెప్పక తప్పదు.
కారణం ఏదైనా, ఓ మంచి యువ క్రికెటర్ చీకట్లోకి వెళ్ళిపోయాడు. కూతురు జన్మించాక తన రాత మారిపోతుందని విశ్వసిస్తున్న శ్రీశాంత్ తిరిగి, భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడా? ఇస్తే మునుపటి ఫామ్ అతను ప్రదర్శించగలుగుతాడా.? ఏమో వేచి చూడాల్సిందే.