మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఎన్నికల ఫలితాల వెల్లడయ్యేందుకు కోర్టు అనుమతి కావాల్సి వచ్చింది. రాజకీయాల తరహాలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికలు హోరెత్తాయి. గట్టిగా వెయ్యి ఓట్లు కూడా లేని ‘మా’ ఎన్నికలు అంతర్గత రాజకీయాల పుణ్యమా అని అంతా ముక్కున వేలేసుకునేలా జరిగిన విషయం విదితమే. ఎన్నికల్ని నిలిపివేయాలంటూ ఓ కళ్యాణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, ఫలితం వెల్లడి ఆలస్యమయ్యిందే తప్ప, ఎన్నికలు ఆగలేదు. పైగా, ఓ కళ్యాణ్‌కి ఫైన్ కూడా విధించింది న్యాయస్థానం.
ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసిందని అంతా అనుకున్నారుగానీ, ఓ.కళ్యాణ్ మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ‘మా’ ఎన్నికలు తాజాగా ఇంకోసారి చర్చనీయాంశమయ్యాయి. సాధారణ ఎన్నికల్లోనూ ఇలాంటి చిత్ర విచిత్రాలెన్నో జరుగుతుంటాయి. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం ఇలాంటి సందర్భాల్ని ఎదుర్కొన్నారు.
ఫలానా ప్రజా ప్రతినిథి ఎంపిక చెల్లదని వారిపై పోటీ చేసి ఓడిపోయినవారు న్యాయస్థానాల్ని ఆశ్రయించడం, ఏళ్ళ తరబడి కేసులు నడిచినా చివరికి ఫలితం తేలకపోవడం చూస్తూనే వున్నాం. ఒకవేళ కేసుల విచారణ వేగంగా జరిగి, తీర్పు వచ్చినా, అప్పటికే పుణ్యకాలం (పదవీ కాలం) పూర్తయిపోవడమూ జరుగుతుంటుంది. అంత సీన్ సిని‘మా’ ఎన్నికలకు అవసరమా? అన్నదే ఇక్కడ ప్రశ్న.
‘మా’ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. అంతకు ముందు ‘మా’ అధ్యక్షుడి పనిచేశారు మురళీమోహన్. వీరిద్దరికీ ఓ.కళ్యాణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మీడియాకి ఇదో న్యూస్.. సినీ వర్గాల్లో అసలు దీన్ని గురించి ఎవరూ పట్టించుకోవడంలేదనడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే, సిని‘మా’టిక్ రాజకీయాల గురించి సినీ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాజకీయాల్ని మించిన వ్యూహాలు, ఎత్తుగడలు సినీ రంగంలో కనిపిస్తున్నాయి. మేమంతా ఒక్కటే.. అని చెప్పే సినీ పరిశ్రమ, ఇదిగో.. ఇలాంటి రాజకీయాలతో తమ మధ్య అంతర్గత విభేదాల్ని బయటపెట్టుకుంటోంది.