ప్రపంచకప్.. టీమిండియాలో ఏం జరుగుతోంది!

ఒక్క పరాజయం, ఒకే ఒక్క పరాజయం టీమిండియాను ఇరకాటంలో పెట్టేసింది. ఆ ఓటమితో వరల్డ్ కప్ లో భారత జట్టు అవకాశాలు ఏమీ దెబ్బతినలేదు కూడా. ఇంగ్లండ్ తో మ్యాచ్ ఓడిపోయినా తదుపరి రెండు…

ఒక్క పరాజయం, ఒకే ఒక్క పరాజయం టీమిండియాను ఇరకాటంలో పెట్టేసింది. ఆ ఓటమితో వరల్డ్ కప్ లో భారత జట్టు అవకాశాలు ఏమీ దెబ్బతినలేదు కూడా. ఇంగ్లండ్ తో మ్యాచ్ ఓడిపోయినా తదుపరి రెండు మ్యాచ్ లలో టీమిండియాకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సెమిస్ లో చోటుకు ఇబ్బంది లేదు.

అయితే ఇంగ్లండ్ తో మ్యాచ్ లో భారత బ్యాటింగ్ తీరు.. డొల్లతనాన్ని బయటపెట్టింది. జట్టులో ఇన్ ఫామ్ బ్యాట్స్ మన్ ఇద్దరు మాత్రమే! రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ. ఆడితే వీళ్లు ఆడాలి. గెలవాలంటే వీళ్లిద్దరూ ఆడాలి. విజయం ఆఖరి వరకూ కూడా వీరే తీసుకెళ్లాలి! ఇదీ టీమిండియా పరిస్థితి అనే విషయం ఇంగ్లండ్ తో మ్యాచ్ తో పూర్తి క్లారిటీ వచ్చింది.

ఓపెనర్ కేఎల్ రాహుల్ శుద్ధ దండగ. హార్ధిక్ పాండ్యా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీళ్లిద్దరూ అయినా గుడ్డిలో మెల్లగా కనిపిస్తూ ఉన్నారు కానీ.. ఎటొచ్చీ మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్ లు మాత్రం భారత అభిమానులనే బెదరగొడుతూ ఉన్నారు!

ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ధాటిగా ఆడాల్సిన సమయంలో ఈ మహనీయులిద్దరూ ఆడిన తీరుతో.. ప్రేక్షకులే విసుగెత్తి పోయారు. ఆడటానికి వెళ్లి ఔట్ అయ్యారంటే అదో రకమైన గౌరవం. అయితే వీళ్లిద్దరూ టెస్ట్ మ్యాచ్ ఆడినట్టుగా ఆడారు. బంతికి రెండు పరుగులు చొప్పున చేస్తే గెలిచే పరిస్థితి ఉంది. గెలుస్తారా గెలవరా అనేది వేరే సంగతి. అసలు ప్రయత్నమే చేయకపోతే దాన్ని ఏమనాలో ధోనీ, జాదవ్ లకే తెలియాలి.

గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ టోర్నీలో వీరిద్దరూ ఇలా ఆడటం తొలి సారి కాదు. అఫ్గానిస్తాన్ తో మ్యాచ్ లో కూడా ఇదే తీరునే సాగింది వీరిద్దరి బ్యాటింగ్! ఆ మ్యాచ్ లో ఏదో బౌలర్ల దయ వల్ల ఇండియా గెలిచింది. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో మాత్రం.. ధోనీ, జాదవ్ లు తమ చేవ ఏమిటో చూపించారు.

ఓడిపోయినా ఏం కాదు.. అన్నట్టుగానే సాగింది వీళ్లిద్దరి బ్యాటింగ్. గెలిపించే పని తమది కాదన్నట్టుగా, గెలుపోటములతో తమకు సంబంధం లేదన్నట్టుగా.. వాళ్లిద్దరూ సింగిల్స్ తీస్తూ, తాపీగా డిఫెన్స్ ఆడుతూ బ్యాటింగ్ సాగించారు. అలాంటి సమయంలో ఇద్దరు బౌలర్లు బ్యాటింగ్ లో ఉంటే ఎలా ఆడతారో.. ధోనీ, జాదవ్ లు అలాగే ఆడారు. బౌలర్లు అయినా బ్యాట్ ఝలిపిస్తారు. అయితే  జాదవ్, ధోనీలు మాత్రం తెడ్డు వేయడంలో పోటీ పడ్డారు!

ఇలా తమ ఫామ్ పై, తమ సత్తాపై ఈ కీలక బ్యాట్స్ మన్ క్లారిటీ ఇచ్చారు. ఇకపై కూడా బౌలర్లు అద్భుతాలు చేసి ఇండియాను గెలిపిస్తే, వాళ్లకు రోహిత్, విరాట్ లు తోడయితే గెలవాలి తప్ప… సమష్టిగా ఆడి టీమిండియా నెగ్గే పరిస్థితిలేదని, ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత అభిమానులకు క్లారిటీ వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ధోనీ, జాదవ్ బ్యాటింగ్ తీరును టీమిండియా మాజీ కెప్టెన్  సౌరవ్ గంగూలీ కూడా తీవ్రంగా విమర్శించారు. 

దాడులపై బాబు మౌనం.. ఓటమికి ఇది కూడా కారణమే