భయానికి మీనింగే తెలియని బ్లడ్ నాది.. అన్నట్లుగా 'నిప్పు'లాంటి డైలాగులు చెబుతుంటారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ముఖ్యమంత్రికి వున్న భద్రత, మాజీ ముఖ్యమంత్రికి వుండదన్న కనీస ఇంగితాన్నీ మర్చిపోవడం చంద్రబాబుకే చెల్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేసిన తనకు భారీ స్థాయిలో భద్రత కల్పించారనీ, ఇప్పుడు మాత్రం భద్రతను కుదించారనీ చంద్రబాబు వాపోతున్నారు.
మామూలుగా, ఇలాంటి సందర్భాల్లో టీడీపీ నేతలు యాగీ చేయాలి.. వారితో అలా హైడ్రామా చంద్రబాబు నడిపించాలి. కానీ, ఇక్కడ చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారు. ఏకంగా, హైకోర్టును కూడా ఆశ్రయించేశారు చంద్రబాబు తన భద్రత గురించి. తనకు ఇదివరకున్న భద్రతను కొనసాగించాలంటూ చంద్రబాబు, హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందన్నది వేరే చర్చ. కానీ, చంద్రబాబు తన భద్రత విషయంలో ఇంతలా ఆందోళన చెందడం మాత్రం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పైగా, 23 మంది ఎమ్మెల్యేలున్న ప్రతిపక్షానికి ఆయన అధిపతి.
ప్రస్తుతానికి టీడీపీలో చంద్రబాబుతో కలుపుకుంటే 23 మంది ఎమ్మెల్యేలు వుండొచ్చుగాక. కానీ, ఓ నెల రోజుల్లోనే మొత్తం టీడీపీ ఖాళీ అయిపోతుందనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ నలుగురు ఎంపీలు (రాజ్యసభ) టీడీపీని వీడిపోయారు. మరికొందరు టీడీపీ ముఖ్య నేతలు, బీజేపీతో టచ్‌లోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో, పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపాల్సింది పోయి.. తాను ధైర్యం కోల్పోయినట్లుగా, తన సొంత భద్రత కోసం న్యాయస్థానాన్ని చంద్రబాబు ఆశ్రయించడం ఆశ్చర్యకరమే మరి.
ఇదిలా వుంటే, చంద్రబాబుకి నిబంధనల మేరకే భద్రత కొనసాగిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతోన్న చంద్రబాబు, ముఖ్యమంత్రి పదవి పోయాక కూడా.. తానే ముఖ్యమంత్రినన్నట్లు వ్యవహరిస్తే ఎలా.? అన్నట్టు, 'చంద్రబాబు జాతీయ స్థాయి నాయకుడు.. గతంలో ఆయనపై మావోయిస్టులు దాడి చేశారు..' అంటూ పాత కబుర్లని తెరపైకి తెస్తున్నారు టీడీపీ నేతలు. గతంలో ప్రతిపక్ష నేతగా వున్న వైఎస్ జగన్ మీద హత్యాయత్నం జరిగితే, 'ఆ బాధ్యత మాది కాదు..' అంటూ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రయత్నించిన చంద్రబాబు.. తనదాకా వచ్చేసరికి.. ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విలవిల్లాడిపోతున్నారన్నమాట.