ప్రపంచ క్రికెట్లో తప్పుడు అంపైరింగ్‌కి దారుణంగా బలైపోయిన ఆటగాళ్ళెవరు.? అంటే ఇంకెవరు.. టీమిండియా ఆటగాళ్ళే.. అని క్రికెట్ పండితులు తేల్చేస్తారు. ప్రధానంగా రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ తప్పుడు అంపైరింగ్‌కి బలైపోయిన ఆటగాళ్ళు. వీళ్ళలో ఒకరితో ఒకరు పోటీ పడ్తారు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు. ఔట్ అవ్వకపోయినా ఔట్.. అని అంపైర్ ప్రకటించేయడంతో, మారు మాట్లాడకుండా ద్రావిడ్, సచిన్ మైదానంలోంచి వెనుదిరిగేవారు.
‘తప్పుడు నిర్ణయం తీసుకున్నాం.. కావాలని చేసింది కాదు..’ అని ద్రావిడ్కీ, సచిన్‌కీ ఎంతమంది అంపైర్లు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పారో లెక్కలు తీయడం కూడా కష్టమే. సచిన్ విషయంలో మరీ అన్యాయం. టీమిండియా ఎప్పుడూ సచిన్ మీదనే ఆధారపడేది. కీలక సమయాల్లో సచిన్‌ని అంపైర్లు పెవిలియన్‌కి పంపేవారు. థర్డ్ అంపైర్ తప్పిదాలూ కొన్ని సార్లు చోటుచేసుకున్నా, సచిన్ ‘అదంతా ఆటలో భాగం..’ అని హుందాతనం చాటుకున్నాడే తప్ప ఏనాడూ అంపైర్ల నిర్ణయాల్ని వ్యతిరేకించలేదు. దటీజ్ సచిన్. ద్రావిడ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అసలు విషయమేంటంటే, భారత్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్, అంపైర్ తప్పుడు నిర్ణయాలతోనే తాము ఓడిపోయామంటూ ఆరోపిస్తోంది. పాక్ క్రికెటర్లు ‘మేం వద్దన్న అంపైర్‌ని బలవంతంగా మా మీద రుద్దేశారు..’ అని ఆరోపిస్తుండడంతో, ఆయా క్రికెటర్లపై ఐసీసీ సీరియస్ అవుతోంది. ఆటలో అన్నీ వుంటాయి.. అందులో పొరపాట్లు కూడా.. అంపైర్లు కూడా మానవ మాత్రులే.. అందుకనే ‘రివ్యూ’కి అవకాశం కల్పించామన్నది ఐసీసీ వాదన.
వరల్డ్ కప్‌లో ఇప్పటిదాకా పాకిస్తాన్, భారత్‌పై గెలిచింది లేదు. ఈసారీ పాకిస్తాన్, టీమిండియా చేతుల్లో చిత్తుగా ఓడింది. దాంతో, పాకిస్తాన్లో అభిమానులు తమ జట్టుపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. వారి దృష్టిని మరల్చేందుకే పాక్ ఆటగాళ్ళు ఈ ఎత్తులకు పాల్పడుతున్నారని అనుకోవాల్సి వుంటుంది. ఆటని ఆటలా చూస్తే అసలు సమస్యే వుండదు. కానీ, ఇండియా – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కేవలం అటగానే కాదు.. ఆధిపత్య పోరు అనేలా సాగుతుంది గనకనే సమస్య తీవ్రతరమవుతోంది.
మైదానంలో ఆటగాళ్ళు చాలా హుందాగా కన్పించారు. ఆవేశకావేశకాలే లేవు. అసలు ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోందా? అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ దురదృష్ట వశాత్తూ మ్యాచ్ ముగిశాక పసలేని ఆరోపణలు చేస్తోంది పాకిస్తాన్. పైగా, మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ ఇంటర్నెట్ వేదికగా కొందరు క్రికెట్ దురభిమానులు కొత్త అనుమానాల్ని తెరపైకి తీసుకొస్తున్నారు. పాక్ ఆటగాళ్ళే అంపైరింగ్‌పై నోరు పారేసుకుంటోంటే, పాక్ క్రికెట్ అభిమానులు ఆగుతారా.?