సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు టీమిండియాకి కోచ్ అవుతారని ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. ఇప్పటికే ఈ ముగ్గురితో బీసీసీఐ సంప్రదింపులు జరిపింది కూడా. ఈ నేపథ్యంలో సగటు క్రికెట్ అభిమాని, టీమిండియాకి ఎవరు కోచ్ అయితే బావుంటుంది.? అంటూ తనకున్న అంచనాల్ని తానే లెక్కలేసుకున్నాడు. ముగ్గురూ ముగ్గురే. ఎవరికి వారు క్రికెట్లో తమదైన ముద్ర వేశారు. ఒకరు టీమిండియాకి అనూహ్య విజయాల్ని అందించిన కెప్టెన్. ఇంకొకరు, మాస్టర్ బ్లాస్టర్. మరొకరు, టీమిండియాని ఆపద సమయాల్లో ఆదుకున్న ‘మిస్టర్ డిపెండబుల్’.
పరిచయం అక్కర్లేని ఆ ముగ్గురూ సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్. క్రికెట్లో ఈ ముగ్గురూ సమకాలీనులు. టీమిండియా టాప్ ఆర్డర్ అత్యద్భుతం.. అనదగ్గ రోజులు ఏవైనా వుంటే అది ఈ ముగ్గురి జమానాలోనే. ఈ ముగ్గురూ ఓపెనింగ్ చేశారు.. జట్టులో వివిధ స్థానాల్లో ఆడారు.. టీమిండియాకి అద్భుత విజయాలు అందించారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ముగ్గురూ కెప్టెన్లుగా పనిచేయడం. బ్యాటింగ్‌లో ఎవరి శైలి వారిదో. బ్యాటింగ్, బౌలింగ్‌తో సచిన్ మెరిస్తే, గంగూలీ కూడా అంతే. ద్రావిడ్ బ్యాటింగ్‌తోపాటు, వికెట్ కీపింగ్ చేశాడు. సచిన్ ఫీల్డింగ్‌లో ఓకే. ద్రావిడ్ మాత్రం గోడ కట్టేసేవాడు. ఫీల్డింగ్ విషయంలో గంగూలీ కాస్త వీక్. కానీ, నాయకత్వ లక్షణాల విషయంలో సచిన్, ద్రావిడ్ కన్నా చాలా పవర్ఫుల్ గంగూలీ.
ఇక, జట్టులో అందర్నీ కలుపుకుపోవడంలో సచిన్, ద్రావిడ్ పోటీ పడ్తారు. ఆ విషయంలో గంగూలీ కాస్త వెనకబడి వున్నాడు. జట్టులో ఎవరితోనూ సచిన్కిగానీ, ద్రావిడ్కిగానీ గొడవల్లేవు. గంగూలీ అలా కాదు. అగ్రెసివ్నెస్ కారణంగానే గంగూలీ కాస్త ఇబ్బందులు పడ్డాడు. చెప్పుకుంటూ పోతే ప్లస్‌లు ఎక్కువగా సచిన్‌కీ, ఆ తర్వాత ద్రావిడ్కీ, చివరగా గంగూలీకి వుంటాయి. గంగూలీకి వున్న మైనస్‌లలో ముఖ్యమైనది కోపం. అదే సమయంలో నాయకత్వ లక్షణాల విషయంలో ద్రావిడ్, సచిన్ చాలా దూరంలో వుంటారు గంగూలీకి. ఇక్కడ గంగూలీదే పై చేయి.
కోచ్‌గా ఎవరు సమర్థులు.? అంటే భారత క్రికెట్ అభిమానులు ముగ్గురికీ సమానంగా ఓటేస్తారు. మైదానంలో అందర్నీ కలుపుకుపోవడం ఎంత ముఖ్యమో, జట్టులో పోరాట పటిమను నూరిపోయడమూ అంతే ముఖ్యం. సో, ఇక్కడ ఒకరు తక్కువ.. ఒకరు ఎక్కువ అనడానికి వీల్లేదు. మరి, టీమిండియా కోచ్ పదవికి ఎవరు ఎంపికవుతారు.? ఇది మాత్రం కాస్త టిపికల్ క్వశ్చనే. బీసీసీఐ ఆలోచనలు ఎలా వున్నాయోగానీ, ముగ్గుర్నీ వాడుకుంటే బావుంటుందేమో.. అని సగటు క్రికెట్ అభిమాని అనుకుంటున్నాడు.
కొసమెరుపేంటంటే కోచ్ ఎంపిక కమిటీలో ఈ ముగ్గుర్నీ చేర్చింది బీసీసీఐ. ఎంపిక కమిటీలో వుంటే, కోచ్ పదవికి సాంకేతికంగా అర్హుడు కాడన్నది బీసీసీఐ వాదన. తొలుత కోచ్ పదవి కోసం సచిన్, ద్రావిడ్, గంగూలీతో విడివిడిగా సమావేశమైన బీసీసీఐ పెద్దలు వారి నుంచి అభిప్రాయాల్ని తీసుకున్నారు. ఏమయ్యిందోగానీ, కోచ్ ఎంపిక బాధ్యత ఈ ముగ్గురిపైనా వుంచడంతో సగటు క్రికెట్ అభిమాని షాక్‌కి గురయ్యాడు. విదేశాలనుంచి కోచ్‌ని రప్పించుకోవడం కన్నా, స్వదేశంలో వున్న టాలెంట్ వినియోగించుకోవడం ఉత్తమం. కానీ, బీసీసీఐ రాజకీయాలు బాగా తెలుసు కాబట్టే, కోచ్ పదవి విషయంలో పై ముగ్గురూ అంత అయిష్టత ప్రదర్శించడంలేదట. అదీ అసలు విషయం.