‘భయో’ డేటా: సీపీఎంయే ‘చూరి’!

పేరు : సీతారామ్ యేచూరి Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: సిపిఎం శాశ్వత ప్రధాన కార్యదర్శి( సాధారణంగా కమ్యూనిస్టు నేతకు ఒక్క సారి పదవిని కట్టబెడితే, దానిని ఆయన ఆజన్మాంతం ఉంచుకుంటారు.) వయసు :…

పేరు : సీతారామ్ యేచూరి

దరఖాస్తు చేయు ఉద్యోగం: సిపిఎం శాశ్వత ప్రధాన కార్యదర్శి( సాధారణంగా కమ్యూనిస్టు నేతకు ఒక్క సారి పదవిని కట్టబెడితే, దానిని ఆయన ఆజన్మాంతం ఉంచుకుంటారు.)

వయసు : కమ్యూనిస్టు రాజకీయాల్లో ఆరవయి దాటితే యవ్వనం వచ్చినట్లు లెక్క, బుధ్ధదేవ్ భట్జాచార్జీల తరం వృద్ధతరమయితే. నాదీ, కారత్‌దీ యువతరం. 

ముద్దు పేర్లు : ఈ ‘తరం’ యేచూరి! ( నేను నవతరానికి తగ్గట్టుగా ఆలోచిస్తాను. అమెరికాతో మన్‌మోహన్ సింగ్ సర్కారు అణు ఒప్పందం పెట్టుకున్నప్పుడు, షరతులు పెట్టాలన్నాను కానీ, మొత్తం రద్దును కోరలేదు. ఇతర నేతలు కోరారు.) ‘సీపీయం యే ‘చూరి’ (ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చిన సిపిఎం ‘చూరు’ పట్టుకుని వదలను.)

విద్యార్హతలు : మాస్టర్ ఆఫ్ ‘సెకనో’ మిక్స్. (కాలంలో సెకను విలువను కూడా తెలిసిన వాడిని. కాబట్టే, పార్లమెంటులో ‘అంతరాయాల’ను సమర్థించాను. ప్రతిపక్షం చేసే అంతరాయాల వల్ల ‘సభాసమయం’ వృధా కాదని వాదించాను. 

గుర్తింపు చిహ్నాలు:

  • చెన్నైలో వున్నప్పుడు తెలుగువాడిగా గుర్తింపు.(మేం చెన్నైలో వున్నప్పుడు, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది)
  • ఢిల్లీలో వున్నప్పుడు హైదరాబాదీగా గుర్తింపు.( మేం హైదరాబాద్ లో వుండగానే 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వస్తే, ఢిల్లీకి వెళ్ళబడ్డాం.)

సిధ్ధాంతం: ‘లెఫ్ట్’ ఈజ్ ఆల్వేజ్ రైట్. (ఈ దేశంలో ‘రైటిస్టు’లను తయారు చేసిన సామాజిక వర్గాలే ‘లెఫ్టిస్టు’లను కూడా తయారు చేశాయి.) 

వృత్తి: దేశం వెలుపల వున్న కమ్యూనిస్టుల మధ్య ఐక్యత చేకూర్చటం.( నేపాల్ మావోయిస్టుల తో మాట్లాడటానికి ఒకసారి వెళ్ళాను లెండి.)

హాబీలు:

  1. ‘లెఫ్ట్ హాండ్ డ్రైవ్’ .అలాగని డ్రైవింగ్ నా హాబీ అనుకునేరు. ఇది నేను ‘హిందూస్థాన్ టైమ్స్’ రాసే కాలమ్ పేరు. నిజంగా నే దేశంలో ‘లెఫ్ట్ హాండ్ డ్రైవ్’ చెయ్యగల వాహనాలు, సోషలిస్టులు లాగా సంఖ్య తగ్గుతూ వచ్చాయి. 
  2. ఉద్యమాలు చెయ్యటం. వృధ్ధ తరం పదవులు తీసుకోవటానికీ, అధికారంలోకి రావటానికీ ఉబలాటం పడుతుంటూ, మేం పార్టీని ఉద్యమాలేక పరిమితం చేశారు. ( జ్యోతి బసును ప్రధానిని కాకుండా మా యువతరం నిలువరించింది. అంతేకాక, పశ్చిమ బెంగాల్ లో ఉద్యమం చెయాలంటే, అధికారంలో వుండకూడదని శపథం చేసి, ప్రతిపక్షంలోకి వచ్చాం.

అనుభవం : కేవలం ‘సుత్తీ, కొడవలి’తోనే ముందుకు వెళ్ళలేం. ఒక్కొక్క సారి ‘పొత్తూ’ కొడవలి కూడా అవసరమవుతాయి. 

మిత్రులు : జెఎన్‌యూ (జవహర్ లాల్ యూనివర్శిటీ)లో  చదివిన వారు ఎక్కడున్నా మిత్రులుగానే వుండిపోతారు. 

శత్రువులు : భూస్వాములు. (కానీ ఇప్పుడు కనబడటం లేదు. ఇప్పుడు వీరు కూడా రైతులుగా మారి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.)

మిత్రశత్రువులు : దగ్గరికి వచ్చినట్టే వచ్చి, దూరమవుతుండే సాటి కమ్యూనిస్టు పార్టీలు. 

వేదాంతం : సరిగ్గా తెలంగాణ, ఆంధ్ర కలిసి ఒక రాష్ర్టంగా ఏర్పడ్డప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకూ ఇద్దరు తెలుగువారు ( పుచ్చల పల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావులు) జాతీయ సారుథులుగా వున్నారు. ఇప్పుడు రాష్ర్టం తెలంగాణ, ఆంధ్రగా విడిపోయిన తర్వాత ఇవే రెండు పార్టీలకు తెలుగువారం (నేనూ, సురవరం సుధాకర రెడ్డీ)  సారథులుగా వున్నాం. పెళ్ళికీ, విడాకులకీ పురోహితులు తెలుగువారే వుండటం విశేషం కాదూ!

జీవిత ధ్యేయం : దేశంలో విప్లవం వెంటనే రాదు కాబట్టి, ఈ పార్లమెంటు రాజకీయాల్లోనే ఉన్నత పదవుల్లో వుంటూ ప్రజలకు సేవ చేసుకోవాలన్నది నా ధ్యేయం.             

సతీష్ చందర్