అజారుద్దీన్ అంతటోడికే తప్పలేదు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. అజారుద్దీన్‌తో పోల్చితే విరాట్ కోహ్లీ ఎంత.? సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్న విషయమిది. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరోపణల నేపథ్యంలో అజారుద్దీన్ క్రికెట్‌కి దూరమైపోయిన విషయం విదితమే.
టీమిండియాకి అప్పట్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ అజారుద్దీన్. కానీ, ఏం లాభం.? క్రికెట్‌కి అర్థాంతరంగా, అత్యంత దయనీయ స్థితుల్లో దూరమవ్వాల్సి వచ్చింది అజారుద్దీన్‌కి.
ఇక, ఇప్పుడు విరాట్ కోహ్లీ వంతు. విరాట్ కోహ్లీ 'వికార పర్వం' గురించి సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు.
టాస్ గెలిచి, బ్యాటింగ్ వదులుకోవడం దగ్గర్నుంచి, సింగిల్ డిజిట్‌కే కోహ్లీ వికెట్ పారేసుకోవడం, బ్యాటింగ్ – బౌలింగ్ విభాగాల్లో టీమిండియా కలిసికట్టుగా వైఫల్యం చెందడం.. ఇలా అన్ని విషయాల్నీ విశ్లేషిస్తూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
మిగతావన్నీ ఓ ఎత్తు.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇంకో ఎత్తు. పాకిస్తాన్ ఫైనల్స్‌లోకి రావడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లే అదొక ఫిక్సింగ్‌గా అభివర్ణించారు. ఆ లెక్కన, ఫైనల్ కూడా ఫిక్స్ అయిపోయి వుండాలి. ఫైనల్ మ్యాచ్ ఫిక్సయ్యిందంటే, అందులో కెప్టెన్ కోహ్లీకీ భాగం వుండి తీరాలి.
'ఇకనైనా పాకిస్తాన్‌కి వచ్చి, పాకిస్తాన్లో ఆడండి..' అంటూ పాక్ కెప్టెన్, క్రికెట్లో 'పెద్ద దేశాలకు' పిలుపు ఇవ్వడమూ ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
ఇదొక్కటే కాదు, ఇంతకన్నా పెద్ద ఆరోపణ ఇంకోటి విన్పిస్తోంది కోహ్లీ మీద. కోచ్ అనిల్ కుంబ్లేతో విభేదాల కారణంగా, జట్టు ప్రయోజనాల్ని కోహ్లీ అండ్ కో – పాకిస్తాన్‌కి తాకట్టు పెట్టేశారనీ, ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ సేన ఆట తీరు చూస్తోంటే, గల్లీ క్రికెట్ ఆడే ఆకతాయిలకన్నా దారుణంగా వుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్తున్నారు. జట్టులో కోహ్లీతోపాటు, మెజార్టీ సభ్యులు కుంబ్లేని కోచ్‌గా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే.
సీనియర్లు మాత్రం, కుంబ్లేని తప్పించడానికి టీమిండియా ఆటగాళ్ళు ఒక్క కారణం కూడా చూపలేకపోతున్నారని అంటున్నారు.
నిజమే మరి, అనిల్ కుంబ్లే సీనియర్ మాత్రమే కాదు.. అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం వున్న వ్యక్తి. కోహ్లీ దూకుడు గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.? కెప్టెన్ గనుక ఆటగాళ్ళంతా కోహ్లీ వెనుక నడవడం సహజమే. కుంబ్లేని మెజార్టీ టీమిండియా సభ్యులు వ్యతిరేకించడానికి కారణం ఇదే కావొచ్చుగాక.
ఏది ఏమైనా, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు – కుంబ్లేపై వ్యతిరేకత.. ఈ రెండూ నిజమవ్వడానికి అవకాశాలైతే లేకపోలేదు. అదే నిజమైతే మాత్రం, విరాట్ కోహ్లీలో ఈ వికార పర్వం.. దేశద్రోహంగానే పరిగణించాల్సి వస్తుంది.