పెళ్ల‌యిన‌ప్ప‌టి నుంచి బెదిరింపులే….!

హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల నాగ‌రాజు అనే యువ‌కుడి ప‌రువు హ‌త్య‌ను మ‌రిచిపోక‌నే, అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటు చేసుకుంది. ఈ ద‌ఫా 21 ఏళ్ల నీర‌జ్ ప‌న్వార్ అనే యువ‌కుడు బ‌లి అయ్యాడు. తాత‌తో క‌లిసి…

హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల నాగ‌రాజు అనే యువ‌కుడి ప‌రువు హ‌త్య‌ను మ‌రిచిపోక‌నే, అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటు చేసుకుంది. ఈ ద‌ఫా 21 ఏళ్ల నీర‌జ్ ప‌న్వార్ అనే యువ‌కుడు బ‌లి అయ్యాడు. తాత‌తో క‌లిసి ద్విచ‌క్ర వాహ‌నంపై వెళుతుండ‌గా చేప‌ల మార్కెట్ స‌మీపంలో నీర‌జ్‌ను దుండ‌గులు అతి కిరాత‌కంగా అంత‌మొందించారు.

24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. అలాగే మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. 

వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుంద‌న్న అక్క‌సుతో యువ‌తి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై బాధిత నీర‌జ్ ప‌న్వార్ భార్య సంజ‌న మీడియాతో మాట్లాడుతూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తన భార్తను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని  సంజన కోరారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. పెళ్ల‌యిన మొద‌లు కుటుంబ స‌భ్యుల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని చెప్పారు. 

నీరజ్‌తో పెళ్లి అయినప్పటి నుంచి వారితో సంబంధాలు లేవని తెలిపింది. తన కజిన్ విజయ్, సంజులే ఈ హత్య చేశారని ఆమె ఆరోపించారు. మరో ముగ్గురుతో కలిసి ఈ దారుణానికి తెగబడ్డారని తెలిపింది. వారి నుంచి తనకు, తన అత్త, మామలకు కూడా ప్రాణహాని ఉందని సంజ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  

ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత త‌మ‌ బిడ్డ చనిపోయిందంటూ వారు త‌న‌ను వదిలేశార‌న్నారు. ఇప్పుడిలా చేయడం వల్ల త‌న‌కు అన్యాయం జరిగింద‌ని సంజన వాపోయింది. భ‌ర్త నీర‌జ్‌ను చంపిన సోద‌రుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలి పెట్టొద్ద‌ని ఆమె కోరారు. న్యాయం కోసం ఎంత వ‌ర‌కైనా పోరాడుతామ‌న్నారు.