కిరణ్ కుమార్ రెడ్డిపై ఆశలు … ఏమైనా చేయగలడా?

కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఒక కల్చర్ డెవెలప్ అయింది. ఆ కల్చర్ ఇప్పటికీ పోలేదు. ఏమిటా కల్చర్? ముఖ్యమంత్రులను, రాష్ట్ర పార్టీ అధ్యక్షులను మారుస్తూ ఉండటం. దీన్నే కదా అలనాడు…

కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఒక కల్చర్ డెవెలప్ అయింది. ఆ కల్చర్ ఇప్పటికీ పోలేదు. ఏమిటా కల్చర్? ముఖ్యమంత్రులను, రాష్ట్ర పార్టీ అధ్యక్షులను మారుస్తూ ఉండటం. దీన్నే కదా అలనాడు ఎన్టీఆర్ ఆయుధంగా చేసుకొని తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చారు. పార్టీ డీలా పడిందని భావిస్తే ముఖ్యమంత్రులను, రాష్ట్ర పార్టీ అధ్యక్షులను మార్చడమే పరిష్కారమని అధిష్టానం భావిస్తూ ఉంటుంది. కానీ ఇతర అనేక కారణాలు ఉంటాయని ఆలోచించదు. 

ఇదే ధోరణిని సోనియా గాంధీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కానీ దేశంలో కాంగ్రెస్ పార్టీ భ్రస్టు పట్టిపోతున్నా అందుకు గాంధీ కుటుంబం బాధ్యత తీసుకోదు. నాయకత్వాన్ని వేరే వాళ్లకు అప్పగించదు. ఇక ఇప్పడు అసలు విషయానికొస్తే … ఏపీ కాంగ్రెస్ పై పార్టీ హై కమాండ్ కు బాగా దిగులు పట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. 

తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా ఒకప్పటి కన్నా చురుగ్గా తయారైంది. పార్టీ సీనియర్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద ఇప్పటికీ గుర్రుగానే ఉన్నా, అంతర్గత కలహాలు చల్లారకపోయినా అధికార పార్టీకి చికాకు కలిగించడంలో పార్టీ చురుగ్గానే ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి అంటున్నాడుగానీ అది జరిగే పని కాదు. ఇందుకు భిన్నంగా ఏపీలో కాంగ్రెస్ ను పార్టీ నాయకులేకాదు, ప్రజలూ పట్టించుకోవడంలేదు. తెలంగాణలో పార్టీ అధికార పార్టీ విధానాల మీద అంతో ఇంతో పోరాటాలు చేస్తోంది. ఏదో విధంగా ప్రజలు మాట్లాడుకునేలా చేస్తోంది.

కానీ ఆంధ్రాలో పూర్తి డీలా పడిపోయింది. పోరాటాల సంగతి పక్కన పెడితే కనీస కార్యక్రమాలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకులు తెలంగాణలో అప్పుడప్పుడైనా పర్యటిస్తున్నారు. ఈ మధ్యనే రాహుల్ గాంధీ వచ్చి వెళ్ళాడు. కానీ పార్టీ జాతీయ నాయకులెవరూ ఆంధ్రా వైపు కన్నెత్తి చూడటంలేదు. జాతీయ నాయకులను రాష్ట్రానికి తీసుకురావాలని ఏపీ నాయకులు కూడా అనుకోవడంలేదు. ఒకవేళ వస్తే ప్రజల ఆగ్రహానికి గురికావలసి వస్తుందనే భయం ఉంది. ఆంధ్రా ప్రజలు ఉమ్మడి ఏపీని చీల్చిన కాంగ్రెస్ ను, బీజేపీని క్షమించేలా లేరు. 

ఒకప్పుడు ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉన్న రఘవీరా రెడ్డి అడ్రసు లేదు. తరువాత అధ్యక్షుడైన డాక్టర్ శైలజానాథ్ ఊసే లేకుండా పోయింది. రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పార్టీని ఎలా బతికి బట్ట కట్టించడం ఎలా  అని అధిష్టానం అదే పనిగా ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి, విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ పిలిపించి సోనియా గాంధీ మాట్లాడారు. 

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగానే ఉన్నారు. హైదారాబాదులో ఉంటూ మౌనంగా కాలక్షేపం చేస్తున్నారు. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డిని సోనియా పిలిపించి మాట్లాడారంటే ఏపీ కాంగ్రెస్ గురించి ఏదో ఆలోచన చేస్తున్నారని అర్ధమవుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపుతో హస్తిన చేరిన ఆయన మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. చివరకు సోనియాగాంధీతో  నల్లారి భేటీ దాదాపు గంట సేపు సాగింది.

ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీలో పెను మార్పులు చేసేందుకు అధినాయకత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి సోనియా భేటీ ఏపీ కాంగ్రెస్ లో మార్పులకు నాందిగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో మాదిరిగా పార్టీలో చురుకుగా పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోనియాగాంధీతో ఈ సందర్భంగా చెప్పినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా, సీనియర్ నేతగా పాలనానుభవం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా సోనియాగాంధీ  కిరణ్ కుమార్ రెడ్డిని ఆదేశించారని చెబుతున్నారు. అధిష్ఠానం పిలుపుతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో ఏపీ పీసీసీ చీఫ్ గా ఆయనకు కాంగ్రెస్ అధినేత్రి బాధ్యతలు అప్పగిస్తారన్న వార్తలు వినవచ్చాయి. ఒకవేళ అదే జరిగితే కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ ను బలోపేతం చేయగలరా? తెలంగాణలో మాదిరి పార్టీని చురుగ్గా మార్చగలరా?