వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారం ఓ ప్రొఫెసర్ అరెస్ట్‌కు దారి తీసింది. చరిత్రపై ఆయనకున్న జ్ఞానమే ఇబ్బందులు తెచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జ్ఞానవాపి మసీదు వ్యవహారం చాలా సున్నితమైంది. మత విద్వేషాలకు దారి తీసే పరిస్థితి వుంది. అందువల్లే దీనిపై సీనియర్ జడ్జి విచారించాల్సిన ఆవశ్యకత ఉందని సర్వోన్నత న్యాయస్థానం కూడా అభిప్రాయపడింది.
జ్ఞానవాపి కేసు పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ శివలింగాన్ని సంరక్షించడంతో పాటు నమాజ్ కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలు మాత్రం కొనసాగుతాయని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ పరిణామాలపై ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ హిస్టరీ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్‌లాల్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అది వివాదాస్పదమైంది.
‘దేశంలో మీరు దేని గురించి మాట్లాడినా.. అది మరొకరి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుంది. ఇది కొత్తేమీ కాదు. నేను చరిత్రకారుడిని, అనేక పరిశీలనలు చేశాను. నా పరిశీలనలో నేను అన్వేషించిన వాటి గురించి రాశాను. నన్ను నేను రక్షించుకుంటాను’ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.
లాల్ అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగంతో పాటు, దళిత సమస్యలపై పని చేస్తున్నారు. ‘అంబేద్కర్‌నామా’ అనే న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు కూడా. దీనికి ఆయన ఎడిటర్-ఇన్-చీఫ్. లాల్ పోస్టు రెచ్చగొట్టేలా ఉందని ఢిల్లీ లాయర్ వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అసోసియేట్ ప్రొఫెసర్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ సైబర్ పోలీసులు తెలిపారు. జ్ఞానం వల్లే లాల్‌కు కష్టాలు తెచ్చి పెట్టిందనే సెటైర్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.