ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ దారుణ హత్య ఘటన ఇంకా ఎవరూ మరచిపోలేదు. సహజీవనంలో ఉన్న ప్రియురాలు శ్రద్ధావాకర్ ని చంపి, ఆమె శవాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టి ఒక్కొక్క శరీర భాగాన్ని ఒక్కోరోజు బయటపడేసి వచ్చేవాడు ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా. శ్రద్ధ హత్య జరిగిన నెలల తర్వాత ఆ వ్యవహారం బయటపడింది. చివరకు హంతకుడు ఆఫ్తాబ్ పోలీసు ఖైదులో ఉన్నాడు. సరిగ్గా ఇలాంటి ఘటనే అసోంలో కూడా జరిగింది.
ఢిల్లీలో జరిగింది ఒకటే హత్య, అసోంలో జంటహత్యలు చేసి మరీ, మృతుల శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో దాచి పెట్టి, రోజుకో పార్ట్ చొప్పున అడవుల్లో పడేసి వచ్చింది హంతకురాలు వందన. భర్త, అత్తను చంపేసి 7 నెలల పాటు ఆ రహస్యాన్ని దాచిపెట్టింది.
అక్రమ సంబంధమే కారణం..
హంతకురాలు వందన భర్త పేరు అమరజ్యోతి డే. అత్త శంకరీ డే. వందనకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. పెళ్లయిన తర్వాత కూడా అతడితో సంబంధం కొనసాగించింది వందన. అయితే వారిద్దరి వ్యవహారం వందన భర్తకు తెలిసింది, అతడు ఆమెను చాలాసార్లు హెచ్చరించారు. వందన అత్తకు కూడా విషయం అర్థమైంది. ఆమెను వారిద్దరూ కట్టడి చేశారు. ప్రియుడిని కలవనీయలేదు.
దీంతో వారిద్దరిపై కక్ష పెంచుకుంది వందన. ప్రియుడి మోజులో భర్తను, అత్తను దారుణంగా చంపేసింది. ప్రియుడి సాయంతో వారిద్దరి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టింది. 3 రోజుల తర్వాత ఆ ముక్కలను చిరపుంజి ప్రాంతంలోని అటవీ ప్రదేశంలో పడేసి వచ్చేసింది.
ఏడు నెలలు దాగిన రహస్యం..
అసోంలోని నూన్ మతి ప్రాంతంలో గతేడాది ఆగస్ట్ లో ఈ హత్య జరిగింది. దాదాపు 7 నెలల పాటు ఈ రహస్యాన్ని దాచి ఉంచింది హంతకురాలు వందన. భర్త, అత్తను హత్య చేసిన తర్వాత ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయింది. మరో ప్రాంతంలో ప్రియుడితో కలసి కాపురం మొదలు పెట్టింది. వందన తండ్రికి కూడా అనుమానం రాలేదు. చివరకు బంధువులకు అనుమానం వచ్చింది. అమర్, శంకరి ఏమైపోయారంటూ వారు ఆరాతీయడం మొదలు పెట్టారు, అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
వారిద్దరూ తీర్థయాత్రలకు వెళ్లిపోయారంటూ అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసింది వందన. కానీ చివరకు తప్పు ఒప్పుకోక తప్పలేదు. వారిద్దర్నీ తానే చంపేశానని.. ప్రియుడు, అతని స్నేహితుడి సాయంతో శరీర భాగాలను ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో దాచి పెట్టానని.. ఆ తర్వాత వాటిని బయట పడేశానని చెప్పుకొచ్చింది.
ఈ ఘటన సంచలనంగా మారింది. భర్త, అత్తను చంపడమే కాకుండా వారి ఆనవాళ్లు కూడా లేకుండా చేయడంతోపాటు, ఏడు నెలలు ఆ రహస్యాన్ని బయటకు రాకుండా చూసింది వందన. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కింది.