బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నాడు. ప్రజల డబ్బును కాపాడాల్సిన పొజిషన్ అతనిది. కానీ హనీ ట్రాప్ లో పడ్డాడు. తన సొంత డబ్బుతో పాటు, ఖాతాదారుల డబ్బును కూడా ఓ గుర్తుతెలియని యువతికి సమర్పించుకున్నాడు. ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు. బెంగళూరులో జరిగింది ఈ హనీ ట్రాప్ వ్యవహారం
హనుమంత నగర్ ఇండియన్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు హరిశంకర్. ఇతడి భార్య గర్భవతి. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది. ఈ గ్యాప్ లో మనోడు ఆగలేకపోయాడు. డేటింగ్ యాప్ లో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఇతడ్ని పూర్తిగా లోబరుచుకుంది అగంతకురాలు. దశలవారీగా డబ్బులు లాగడం మొదలుపెట్టింది.
ముందుగా తన దగ్గరున్న 12 లక్షలు సమర్పించుకున్నాడు హరిశంకర్. ఇంకా కావాలని కోరింది. దీంతో తన బ్యాంక్ లోనే ఖాతా తెరిచిన ఓ కస్టమర్ అనిత పేరిట దొంగ లోన్ తీసుకున్నాడు. ఆమె డిపాజిట్ ఆధారంగా ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలు తెరిచి, అందులోకి 5 కోట్ల 82 లక్షల రూపాయలు జమచేశాడు. ఆ డబ్బును పశ్చిమ బెంగాల్ లోని 28 ఎకౌంట్లకు తరలించాడు.
ఇలా 6 రోజుల వ్యవథిలో 136 సార్లు చేశాడు హరిశంకర్. లెక్కలేకుండా సాగుతున్న ఈ ఆర్థిక లావాదేవీలు హెడ్ ఆఫీస్ కంట పడ్డాయి. అంతర్గత విచారణ చేపట్టగా, ఇంటి దొంగ పని అని తెలిసింది. హరిశంకర్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే, హనీ ట్రాప్ బయటపడింది. వెంటనే అతడి ఫోన్ ను స్వాధీనం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు, టెక్ నిపుణుల సాయంతో మొత్తం బోగాతాన్ని వెలికితీశారు. గుర్తుతెలియని మహిళతో హరిశంకర్ సాగించిన లీలలన్నీ బయటకు తీశారు. ప్రస్తుతం ఆ 28 ఎకౌంట్లను ఫ్రీజ్ చేసే పనిలో పడ్డారు. వీటిలో చాలా ఎకౌంట్లలో డబ్బు లేదు.