ఆత్మకూరు ఉప ఎన్నికల్లో కొడాలి నానికి ఓ మండలం అప్పగిస్తే, ఆయన కనీసం ప్రచారానికి కూడా రాలేదు. అనిల్ కుమార్ యాదవ్ కూడా ప్రచారానికి రాలేదు కానీ, నామినేషన్ రోజు మాత్రం ఇలా వచ్చి అలా ఫొటోలకు పోజులిచ్చి వెళ్లిపోయారు. మాజీలైపోయిన తర్వాత తమకు బాధ్యత లేదని వీరు అనుకుంటున్నారా..? మాజీలయ్యాక అసంతృప్తి చాలామందిలో ఉంది, కానీ దాన్ని అప్పుడప్పుడూ బయటపెడుతున్నారే కానీ, ఇలా పూర్తిగా సైలెంట్ అయిపోలేదు.
ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం విషయంలో ఇలా మాజీ మంత్రులిద్దరూ తమకెందుకులే అని సైలెంట్ గా ఉన్నారు. పదవిలో ఉండగా.. హడావిడి చేసినా, పదవి కోల్పోయాక మాత్రం వీరిలో ఆ అసంతృప్తి బాగానే ఉన్నట్టు అర్థమవుతోంది.
పదవులు కోల్పోయిన తర్వాత కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, పేర్ని నాని వంటి వారు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. పేర్ని నాని ప్రెస్ మీట్లతో వైరి వర్గాలపై విరుచుకుపడుతుండగా.. బాలినేని ఇటీవల ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. అయితే మిగతా వారు మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉన్నారు.
మేకతోటి సుచరిత, అవంతి శ్రీనివాస్, ఆళ్ల నాని, కన్నబాబు.. ఇలా కొంతమంది మాజీలు మాత్రం ఇంకా యాక్టివ్ కాలేదు. మంత్రి పదవిలో ఉండగా.. హడావిడి, ప్రెస్ మీట్లు, ప్రతిపక్షాలపై విమర్శలు.. ఇలా ఉండేది వీరి షెడ్యూల్. ఇప్పుడు మాత్రం కనీసం నియోజకవర్గంలో కూడా ఎక్కడా కనిపించట్లేదు. సామాజిక సమీకరణాలతో మంత్రి పదవులకు దూరమైనవారంతా.. పరిస్థితిని అర్థం చేసుకుని యాక్టివ్ అయినప్పుడు మాత్రమే జగన్ తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ ఫలితం దక్కుతుంది. పదవులు లేవనే కారణంతో వెనక్కి తగ్గితే మాత్రం ప్రతిపక్షాలకు అనవసరంగా ఛాన్స్ ఇచ్చినట్టవుతుంది.
జగన్ వ్యూహం ఏంటి..?
పదవులు కోల్పోయినవారికి తాత్కాలికంగా కార్పొరేషన్ పదవులు ఇచ్చినా.. వారు సంతృప్తి చెందలేదని తేలిపోయింది. మరి వారిని బుజ్జగించడానికి ఏం చేయాలి..? మళ్లీ గెలిచాక మంత్రి పదవులిస్తామనే హామీ పెద్దగా ప్రభావం చూపినట్టు లేదు.
ఈ దశలో మాజీలందర్నీ తిరిగి యాక్టివ్ చేయాలంటే ఏం చేయాలి..? దీనిపై జగన్ వ్యూహం ఏదో ఉండే ఉంటుంది..? అది త్వరగా అమలులోకి వస్తేనే 2024 ఎన్నికల్ని వైసీపీ మరింత సమర్థంగా ఎదుర్కోగలదు.