ఆయన టీడీపీలో రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానం చేసిన నాయకుడు. మూడు సార్లు ఆ పార్టీ టికెట్ ఇస్తే రెండు సార్లు గెలిచి వచ్చిన ఎమ్మెల్యే. అయితే 2020లో వైసీపీకి మద్దతుగా ఆయన ఆ పార్టీ నీడకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే పార్టీ టికెట్ కన్ ఫర్మ్ అయిందని కూడా ప్రచారంలో ఉంది.
ఈ నేపధ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం జరిగిన పార్టీ ప్లీనరీలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. తన ప్రాణం పోయేంతవరకూ వైసీపీని వీడను అని ఒట్టేశారు. జగన్ వంటి నాయకుడు, వైసీపీ వంటి పార్టీ మరోటి లేదని కూడా ప్రకటించారు.
అదే టైమ్ లో టీడీపీ జనసేనల మీద ఆయన వేసిన పంచ్ డైలాగులు బాగానే పేలాలి. ఆ రెండు పార్టీలకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యమే లేదని వాసుపల్లి అంటూ మీరు ఒంటరిగా వచ్చినా జంటగా వచ్చినా ఫలితంలో తేడా ఏమీ ఉండదని జోస్యం చెప్పారు.
ఈసారి ఎన్నికల్లోనూ గత ఫలితాలే ఆ పార్టీలకు వస్తాయని, జనాలు వైసీపీ వైపే ఉన్నారని వాసుపలి పేర్కొన్నారు. చెప్పిన మాటకు కట్టుబడి హామీలు నెరవేరుస్తున్న వైసీపీని కాదని ప్రజలు ఎక్కడికీ పోరని, విపక్షాలవి పగటి కలలు కాక తప్పదని కూడా చేదు నిజం చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ జెండాతోనే కడదాకా అని వాసుపల్లి చేసిన సెంటిమెంట్ స్పీచ్ మాత్రం క్యాడర్ ని బాగా ఆకట్టుకుంటోంది.
ఇక బడుగు వర్గాలకు చెందిన ఉన్నత విద్యావంతుడైన వాసుపల్లిని జగన్ వదులుకోరని, అందుకే టికెట్ కి భరోసా ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే వాసుపల్లికి మంత్రి పదవి కూడా దక్కుతుందని ఆయన వర్గమే కాదు, రాజకీయాలను విశ్లేషించేవారు కూడా చెబుతున్న మాట.