పవన్ కల్యాణ్ కు మెమరీ లాస్ వచ్చిందా? లేకపోతే అంత తొందరగా.. కొన్ని నెలల కిందట జరిగిన విషయాల్ని ఆయన ఎలా మర్చిపోగలిగారు? ఒక వేలితో ఎదుటివారిని చూపిస్తూ నిందలు వేస్తున్నప్పుడు.. తన చేతిలోని మరో మూడు వేళ్లు తననే చూపిస్తుంటాయని, తాను చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలని పెద్దలు చెప్పే చాలా బేసిక్ నీతిని ఆయన ఎలా మర్చిపోయారు? అంత ఫూలిష్ గా ఎదుటివారికి నీతులు చెప్పడానికి మాత్రం ఎలా తయారయ్యారు? ఇలాంటి సందేహాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి.
ఎందుకంటే పవన్ కల్యాణ్ ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఆ నీతులను ఆచరించడం పాటించడం ఎలాగో తనకు ఇసుమంతైనా తెలియకపోయినా సరే.. ఎదుటివారికి చెప్పడానికి ఆయన సిగ్గుపడడం లేదు.
జనసేన పార్టీకి చెందిన అధికార ప్రతినిధి మీద కొందరు వ్యక్తులు ఫోనులో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారట. దిగజారిపోయిన వర్తమాన రాజకీయాల్లో ఇది చాలా మామూలు సంగతి. ‘తమలపాకుతో నీవొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా..’ తరహా రాజకీయాలు మాత్రమే ఇప్పుడు నడుస్తున్నాయి. ఏ నాయకుడూ/ నాయకురాలూ అనుచితమైన మాటలు ఏమీ మాట్లాడకుండానే ప్రతిస్పందన వస్తుందని అనుకోవడం భ్రమ.
జనసేన సభలో రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేద్దాం అంటూ నానా మాటలూ అన్న జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణకు కొన్ని అసభ్య ఫోన్ కాల్స్ వచ్చాయట. అందుకని పవన్ కల్యాణ్ రెస్పాండ్ అయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు.
ఇంతకూ జనసేనాని ఏం చెబుతున్నారో తెలుసా? బాలినేని అనుచరులు రాయపాటి అరుణపై వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని ఖండిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు సాధారణమే, కానీ ఆడబిడ్డలపై వ్యక్తిగత దూషణలకు దిగితే బలంగా సమాధానం చెప్పుతాం అని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇంత నిస్సిగ్గుగా, గతం గుర్తు లేకుండా పవన్ కల్యాణ్ ఎలా మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావడం లేదు.
రాయపాటి అరుణకు అసభ్య ఫోన్ కాల్స్ వచ్చిన మాట నిజమే కావొచ్చు. అవి చేసినది బాలినేని అనుచరులేనా కాదా అనేది వేరే సంగతి. అమర్యాదగా మాట్లాడ్డం ఇదేం పద్ధతి? అంటూ పవన్ ప్రశ్నిస్తున్నారు. కానీ.. ఆ ఫోన్లు చేసిన వారు ఏ తప్పునైతే చేశారో.. అది తాను నేర్పిన విద్యే కదా అని మరచిపోతున్నారు!! అందుకే మెమరీ లాస్ ఉన్నదేమో అని డౌటు కొడుతోంది.
కొన్ని నెలల కిందట.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే సినీ నటుడు పోసాని కృష్ణమురళి విషయంలో ఏం జరిగింది? ఆయన పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని విమర్శిస్తే.. ఆయన భార్య గురించి ఎంత నీచంగా కామెంట్లు చేశారో అందరికీ తెలుసు! పోసానికి కొన్ని వందల వేల ఫోన్ కాల్స్ చేసి.. ఆయన భార్య గురించి కుటుంబం గురించి ఎంత నీచంగా మాట్లాడారో అందరికీ తెలుసు. ఆ విషయాలన్నీ వారు పంపిన మెసేజీలతో సహా పోసాని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.
పవన్ కల్యాణ్ దృష్టిలో జనసేన పార్టీలో ఉంటే మాత్రమే ఆడబిడ్డలా? పరాయివాళ్ల భార్యలు ఆడబిడ్డలు కాదా? అనే సందేహం ప్రజలకు కలుగుతోంది? ఇవాళ తన పార్టీకి చెందిన అరుణను ఒక్క మాట అనేసరికి పవన్ కల్యాణ్ కు రోషం పొడుచుకు వస్తున్నదే.. ఆరోజున పోసాని కుటుంబం గురించి అంత నీచంగా తన మనుషులు మాట్లాడుతోంటే.. చెవిటివాడిలాగా, గుడ్డివాడిలాగా ఎలా ఉండిపోగలిగారు? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.
‘‘బాలినేనీ మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి’’ అంటూ సుద్దులుచెబుతున్న పవన్.. ఆ రోజున తాను తన వారికి ఏం నీతులు చెప్పారో ఓసారి గుర్తుచేసుకుంటే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు.