ఈ నియోజకవర్గాల్లో వైసీపీని నవరత్నాలు కాపాడతాయా?

ఒక్కోసారి వైసీపీ వైఖరి చూస్తే, అది నమ్మకమో, అతి విశ్వాసమో అర్థం కాదు. ఏకంగా కుప్పంలో టీడీపీ గోడలు బద్దలు కొడతాం అంటారు. హిందూపురంలో బాలయ్యను ఇంటికి పంపిస్తామంటూ ప్రకటనలు చేస్తారు. మంగళగిరిలో లోకేష్…

ఒక్కోసారి వైసీపీ వైఖరి చూస్తే, అది నమ్మకమో, అతి విశ్వాసమో అర్థం కాదు. ఏకంగా కుప్పంలో టీడీపీ గోడలు బద్దలు కొడతాం అంటారు. హిందూపురంలో బాలయ్యను ఇంటికి పంపిస్తామంటూ ప్రకటనలు చేస్తారు. మంగళగిరిలో లోకేష్ ను మరోసారి ఓడిస్తామని శపథం చేస్తారు. అలా నారా-నందమూరి వంశానికి అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేకుండా చేస్తామంటూ గొప్పగా చెబుతారు. ఈ నియోజకవర్గాల్లోనే కాదు, చాలా సెగ్మెంట్లలో వైసీపీది ఇదే మాట. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నం.

నెల్లూరులో కాకాణి-అనీల్ మధ్య వైరం నివురుగప్పిన నిప్పులా అలానే ఉంది. ఇద్దరూ జగన్ దగ్గర పంచాయితీకి వెళ్లారు. బయటకొచ్చి ఆల్ ఈజ్ వెల్ అన్నారు. కానీ స్థానికంగా మాత్రం ఎవరి కోటరీలు వాళ్లవి, ఎవరి రాజకీయాలు వాళ్లవి. గన్నవరంలో వల్లభనేని, యార్లగడ్డ వెంకట్రావ్ మధ్య వైరం ఆరని నిప్పులా రగులుతూనే ఉంది. ఇక మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ బాలశౌరికి మధ్య విబేధాల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు హిందూపురంలో కూడా పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు.

జస్ట్ కొన్ని రోజుల కిందటే జగన్ అనంతపురంలో పర్యటించారు. అందర్నీ ఒకటి చేసే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే హిందూపురంలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ ఇక్బాల్, ప్రెస్ క్లబ్ లో చేసిన వీరంగాన్ని ఎల్లో మీడియా హైలెట్ చేసింది. సొంత పార్టీ లోనే ఇక్బాల్ కు వ్యతిరేక వర్గం తయారైన సంగతి అందరికీ తెలిసిందే.

హిందూపురం, గన్నవరం, మచిలీపట్నం, నెల్లూరు.. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ కి తలనొప్పులు తెప్పించే నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. విశాఖ సౌత్ లో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. రాపాక ప్రాతినిధ్యం వహిస్తున్న రాజోలులో కూడా పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రబుల్ షూటర్స్ గా సజ్జల, పెద్దిరెడ్డి లాంటి వాళ్లు రంగంలోకి దిగుతున్నప్పటికీ ఫలితం కనిపించకపోవడం, పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే టైమ్ ఉంది. ఇలాంటి టైమ్ లో స్థానికంగా ఉన్న ఇలాంటి అసంతృప్తుల్ని బుజ్జగించాల్సిన అవసరం ఉంది. అప్పటికీ దారిలోకి రాకపోతే వదిలించుకోవాల్సిన తెగువ కూడా ఉండాలి. లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఎన్ని మంచి పనులు చేసినా, నవరత్నాల్ని ఎంత సమర్థంగా అమలుచేసిన వైసీపీకి ఒరిగేదేం లేదు.