ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకంతో… ఏడాదికి ఎదురు చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కల నెరవేరింది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకుని, పరీక్ష ఉత్తీర్ణులైన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ జీఓ ఎంఎస్ నెంబర్ 5 ద్వారా శనివారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఈ విషయాన్ని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజానీకం ప్రశంసలు అందుకున్నారు. లక్ష మందికి పైగా రెగ్యులర్, అలాగే 4 లక్షలకు పైగా వాలంటరీ ఉద్యోగాల కల్పనకు ఈ వ్యవస్థ కారణమైంది.
ప్రజలు మండల కార్యాలయాల చుట్టూ తిరగకుండా, నేరు వాళ్ల దగ్గరికే ప్రభుత్వం వెళ్లేలా సచివాలయ వ్యవస్థ తోడ్పడింది. రెండేళ్లకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్భాటంగా ప్రకటించారు. అయితే నిర్ణీత గడువు పూర్తయినా ప్రొబేషన్ డిక్లరేషన్ కాకపోవడంతో సచివాలయ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి గూడు కట్టుకుంది.
తాజా నిర్ణయంతో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు. ప్రొబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వడం విశేషం.