చేరికలతో జోష్ సరే …పార్టీ అధికారంలోకి వస్తుందా?

ఏ రాజకీయ పార్టీలోనైనా ఒరిజినల్ నాయకులకంటే (ఈ పార్టీలోనే పుట్టి పెరిగినవారు) వలస నాయకులు అంటే వేరే పార్టీల నుంచి వచ్చి చేరినవారు ఎక్కువమంది ఉంటారు. కాలక్రమంలో ఒరిజినల్ నాయకులకంటే వలస నాయకులకు ఎక్కువ…

ఏ రాజకీయ పార్టీలోనైనా ఒరిజినల్ నాయకులకంటే (ఈ పార్టీలోనే పుట్టి పెరిగినవారు) వలస నాయకులు అంటే వేరే పార్టీల నుంచి వచ్చి చేరినవారు ఎక్కువమంది ఉంటారు. కాలక్రమంలో ఒరిజినల్ నాయకులకంటే వలస నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. వారికే పదవులు వస్తాయి. ఇందుకు మంచి ఉదాహరణ టీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణా వచ్చిందని ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ గుండెలు బాదుకుంటారు. 

తెలంగాణా సోనియా గాంధీ ఇచ్చిన కానుక అని చెబుతుంటారు. కానీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అధికారంలోకి రాలేకపోయింది. కేసీఆర్ వల్లనే తెలంగాణా వచ్చిందని ప్రజల మనస్సులో బాగా నాటుకుపోయింది. కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణా తెచ్చారని టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ ప్రచారం చేస్తుంటారు. ప్రజలను నమ్మించడంలో టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.

కాంగ్రెస్ వల్లనే తెలంగాణా వచ్చినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో ఆ పార్టీ నాయకులు విఫలమయ్యారు. ఇందుకు అంతర్గత కలహాలు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రతి పార్టీలో అంతర్గత కలహాలు ఉండటం సహజం. కానీ బలమైన అధినేత ఉన్నప్పుడు అవి బయటకు రావు. కానీ కాంగ్రెస్ లో అలా కాదు. పార్టీ  కలహాలు మీడియాలో ఎక్కువగా ప్రచారం పొందుతాయి. 

టీడీపీ నుంచి వచ్చిన  రేవంత్ రెడ్డిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేయాలని అధిష్టానం అనుకున్నప్పుడు కాంగ్రెస్ లో ఎంత గొడవలు అయ్యాయో మనకు తెలుసు. సరే ….  కాలక్రమంలో  అంతా సద్దుమణిగి కొంతకాలంగా అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి మొదలయ్యాయి. దీంతో పార్టీలో జోష్ కనబడుతోంది. కాంగ్రెస్ లో వరస చేరికలు మరింత ఊపు తెస్తున్నాయి. గత రెండు నెలలుగా కాంగ్రెస్ లో మంచి జోష్ కన్పిస్తుంది. 

ఎన్నికల ముందు చేరికలు పార్టీకి ఎంతో ఊపు తెస్తాయి. జనాల ఆలోచనల్లోనూ మార్పు తెస్తుంది. నేతల చేరికల వల్ల పార్టీ కార్యకర్తల్లో కూడా జోష్ పెరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత పెద్దగా చేరికలు లేవు. అయితే గత నెల రోజుల నుంచి వరస చేరికలు జరుగుతున్నాయి. రేవంత్ ప్రధానంగా చేరికలపైనే దృష్టి పెట్టినట్లు కనపడుతుంది.

తెలంగాణలో ఇటీవల రాహుల్ గాంధీ టూర్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన సతీమణి మంచిర్యాల జడ్పీ ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి కాంగ్రెస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ కార్పొరేటర్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు వరసగా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి అయితే ఖమ్మం జిల్లాలో సునామీ పుడుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో బీజేపీలో చేరికలు లేవు. ఆ పార్టీ కొంత దూకుడుగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో చేరితే విలువ ఉండదని భావించే కాంగ్రెస్ ను నేతలు ఆశ్రయిస్తున్నట్లు కనపడుతుంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు ఉన్న ఓటు బ్యాంకులో కొంత కూడా బీజేపీకి లేకపోవడం, ఆ పార్టీ కొన్ని నియోజకవర్గాలకే పరిమితం కావడం వంటి కారణాలు కూడా కాంగ్రెస్ లో చేరికలకు కారణంగా చెబుతున్నారు. 

గత ఎన్నికల్లో 100కు పైగా నియోజకవర్గాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయిన సంగతిని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొద్దికొద్దిగా పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. పార్టీలోకి చేరికలతో పార్టీలో కొత్త జోష్ ను తీసుకురావడానికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయని, కాంగ్రెస్ పార్టీలోకి చేరికల తుఫాను రాబోతోందని టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఆసక్తికర చర్చకు కారణమైంది.  కాంగ్రెస్ పార్టీలోకి చేరికలపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణాలోని రాజకీయ పార్టీలు దీనిపై చర్చ జరుపుతున్నాయి. 

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పై పార్టీలో అంతర్గతంగా తీవ్రస్థాయిలో అసమ్మతి కనిపిస్తోంది. చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నేతలు, పార్టీలో తమకు ప్రాధాన్యం లేదని పక్క చూపులు చూస్తున్నారు. ఓవర్ లోడ్ అయిన టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు రావాలి అని భావిస్తున్న వారి చర్యలపై దృష్టి పెట్టి వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి.

పార్టీ నుంచి బయటికి రావాలి అని భావిస్తున్నవారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీలో ఉన్న రాజకీయాలు పార్టీలో చేరాలనుకునే వారిని ఆలోచించేలా చేస్తున్నాయి. అటు టీఆర్ఎస్ పై పెరుగుతున్న అసమ్మతి, ఇటు బిజెపిలో అంతర్గతంగా ఉన్న ఇబ్బందులు వంటి పరిస్థితులను అడ్వాంటేజ్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అదును చూసి బయటకు రావాలనుకుంటున్న నేతలను హస్తం బాట పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పునర్వైభవం తీసుకు రావాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికలకు ముందే భారీగా చేరికలతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన తమ పార్టీలోకి ఎవరు చేరుతున్నారు? ఎవరు తనకు టచ్ లో ఉన్నారు అన్న విషయాలు కూడా బయటకు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చేరికల కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు బాగానే ఉన్నాయిగాని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగలుగుతుందా అన్నదే  మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. 

పార్టీ అధికారంలోకి  వస్తుందనే సూచనలు కనబడ్డప్పుడు లేదా ఆ పరిస్థితి ఉన్నప్పుడు చేరికలకు అర్ధం పరమార్ధం ఉంటాయి. మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ లో చేరినవారు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు.