ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సరేష్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురంలో తన కళాశాలలో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఒక్కసారిగా ఆయన కిందపడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వైద్యుల్ని కళాశాల వద్దకు రప్పించారు.
సరేష్‌కు వైద్య పరీక్షలు చేశారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్లే మంత్రి సురేష్ కిందపడినట్టు వైద్యులు తెలిపారు. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రస్తుతం ఆయన కళాశాలలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదిలా వుండగా ఇటీవల మంత్రి సురేష్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. మే 31న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
గుండె రక్తనాళంలో లోపం ఉన్నట్టు వైద్యులు నిర్ధారించి ట్రీట్మెంట్ ఇచ్చారు. సురేష్‌కు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేసి స్టంట్ వేశారు. మంత్రిని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా మరోసారి అనారోగ్యం బారిన పడడంతో జాగ్రత్తంగా ఉండాలని మిత్రులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.
మంత్రిగా ఆదిమూలపు సురేష్ రెండోసారి జగన్ కేబినెట్‌లో అవకాశాన్ని దక్కించుకున్నారు. తనను తొలగించి, సురేష్‌ను కొనసాగించడంపై జగన్ సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అలకబూనిన సంగతి తెలిసిందే. జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన మంత్రిగా సురేష్ గుర్తింపు తెచ్చుకున్నారు.