గృహ హింస.. ఈ పేరు వినగానే భార్యను భర్త చిత్రహింసలు పెట్టిన సందర్భాలు, ఘటనలు కోకొల్లలు గుర్తొస్తాయి. మరి దీనికి రివర్స్ లో జరిగితే..? దాన్ని కూడా గృహ హింసే అంటారు. ఓ భర్త, తనపై జరుగుతున్న గృహ హింసను బయటపెట్టాడు. ఎవ్వరూ నమ్మరేమో అనే ఉద్దేశంతో సీక్రెట్ కెమెరాతో షూట్ చేసిన వీడియోల్ని కూడా రిలీజ్ చేశాడు. రాజస్థాన్ లో జరిగింది ఈ ఘటన.
భార్యలే కాదు, భర్తలు కూడా గృహ హింసను ఎదుర్కొంటారు. రాజస్థాన్ అల్వార్ జిల్లా భివాడీలో అజిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఉంటున్నాడు. అతడు ఓ స్కూల్ ప్రిన్సిపాల్. చుట్టుపక్కల మంచి పేరు కూడా ఉంది. 8 ఏళ్ల కిందట సుమన్ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ ఓ కొడుకు కూడా పుట్టాడు.
అయితే కొన్నాళ్లుగా సుమన్ ప్రవర్తనలో తీవ్రమైన మార్పులొచ్చాయి. భర్తను చూస్తేనే ఆమెకు చిరాకు, అసహ్యం. దీంతో చేతికి ఏది దొరికితే దాంతో కొట్టడం మొదలుపెట్టింది. ఇలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. కొన్ని నెలలుగా భార్య చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్నాడు సింగ్.
తనకు జరుగుతున్న అన్యాయంపై నేరుగా పంచాయితీ పెడితే, ఈ పాడు సమాజం భర్తను అర్థం చేసుకోదని సింగ్ కు బాగా తెలుసు. అందుకే తనకు జరిగిన అన్యాయాన్ని సాక్ష్యాలతో బయటపెట్టాలనుకున్నాడు. భార్యకు తెలియకుండా హాల్ లో సీక్రెట్ గా ఓ కెమెరా పెట్టాడు. అప్పుడు బయటపడ్డాయి అసలు నిజాలు.
ఓ రోజు అప్పడాల కర్రతో భర్తను వాయించి వదిలిపెట్టింది భార్య. మరోరోజు కొడుకు ఆడుకునే క్రికెట్ బ్యాట్ తో తరిమితరిమి కొట్టింది. ఇంకో రోజు టేబుల్ పై ఉన్న వాటర్ జగ్ ను భర్త పై విసిరింది. మరోవైపు ఓ గదిలో పెట్టి తలుపేసింది. ఇలా శారీరకంగా హింసించడంతో పాటు మానసికంగా కూడా చిత్రహింస పెడుతోందంటూ వీడియోలతో సహా కోర్టును ఆశ్రయించాడు సింగ్.
గౌరవప్రదమైన వృత్తిలో ఉండడం వల్ల ఇన్నాళ్లూ తను అన్నింటినీ సహించానని, ఇక తన వల్ల కాదంటూ కోర్టు ముందు లబోదిబోమన్నాడు. సింగ్ వాదనలతో ఏకీభవించిన కోర్టు, ప్రస్తుతానికి అతడికి పోలీసు సెక్యూరిటీ కల్పించింది. ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.