గతంలో ఫోక్స్ వాగన్ కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సమయంలో ప్రభుత్వం అడ్వాన్స్ లు ఇచ్చి మోసపోయింది. అప్పట్లో కంపెనీ రాలేదు, డబ్బులు పోయాయి కదా అని అడిగితే.. సదరు శాఖ మంత్రి బొత్స సొమ్ములు పోనాయ్.. ఏటిసేత్తాం అని సెలవిచ్చారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు అదే ఆయనకు హుక్ లైన్ గా మారిపోయింది.
ఇప్పటికీ విమర్శకులకు అదో పంచ్ డైలాగ్ అవుతోంది. తాజాగా మరో ఆణిముత్యాన్ని వదిలారు మంత్రి బొత్స. ప్రజాస్వామ్యంలో జిల్లాల పేర్లు మార్చడం నిరంతర ప్రక్రియ అని సెలవిచ్చారు. ఆర్నెల్లు పోతే మరో జిల్లా పేరు మార్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో జరిగిన అల్లర్ల ఘటనలపై వివరణ ఇచ్చే క్రమంలో ఇలా 'నిరంతర ప్రక్రియ' అనే పదప్రయోగం చేశారు బొత్స.
జిల్లాల పునర్విభజన సమయంలోనే పేరు మార్చి ఉండొచ్చు కదా, అప్పుడు కోనసీమ అని, ఇప్పుడు కొత్తగా బీఆర్ అంబేద్కర్ అనడంతోనే అసలు సమస్య మొదలైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా పేరు మార్పు అనేది నిరంతర ప్రక్రియ అన్నారు బొత్స, ఆర్నెళ్ల తర్వాత మరో జిల్లా పేరు కూడా మారే అవకాశం ఉందన్నారు.
అయితే ఆయన ఆ మాట చెప్పిన ఉద్దేశం వేరు.. పేరు మార్చాలనుకుంటే దానికి మహూర్తం చూసుకుంటారా..? అప్పుడు మార్చలేకపోయాం, ఇప్పుడు మార్చాం.. అందరూ ఓకే అంటేనే కదా పేరు మార్చింది.. అని చెప్పాలనుకున్నారు బొత్స. కానీ ఇలా ఆర్నెళ్లలో మరో జిల్లా పేరు మార్చే అవకాశముందని చెప్పడం మాత్రం సంచలనంగా మారింది. బొత్సపై మరోసారి సెటైర్లు పేలుతున్నాయి.
ఏ జిల్లా ఏ జిల్లా మీది..?
ఇప్పటికే ఏ జిల్లా ఏ జిల్లా మీది అనే సినిమా పాట జిల్లాల పేరు మార్పు వ్యవహారంలో బాగా పాపులర్ అయింది. ఇలా ఆర్నెళ్లకోసారి జిల్లాల పేర్లు మార్చుకుంటూ పోతే అసలు ఎవరిది ఏ జిల్లా అని ఎలా తెలుస్తుంది. ఇప్పటికే పునర్విభజనతో.. పలు సర్టిఫికెట్లలో పేరు మార్పుకోసం పథకాల లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.
ఆర్నెళ్ల తర్వాత జిల్లా పేరు మారితే.. మరోసారి వారంతా ఆధార్ లో, సర్టిఫికెట్లలో పేరు మార్చుకోవాల్సిందే. ప్రతి ఆఫీస్ పైనా పేరు మార్చాలి, అధికారిక జీవోల్లో, ఇతర వ్యవహారాల్లో కొత్త పేర్లు తీసుకు రావాలి. అసలు ఇలాంటి అవస్థలన్నీ దేనికి. అనవసరంగా పేరు మార్చడం ఎందుకు..?
ఇప్పటికే కోనసీమ విషయంలో జరగాల్సిన రాద్ధాంతం అంతా జరిగిపోయింది. మరోసారి మంత్రి బొత్స వ్యాఖ్యలతో జిల్లాల పేర్లతో అలజడి మొదలయ్యే అవకాశముంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఫ్లోలో ఏదో మాట్లాడేశాం దాన్ని సీరియస్ గా తీసుకుంటారెందుకు అనకూడదు.
మాట్లాడేముందే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మీడియా వక్రీకరించింది, జనం తప్పుగా అర్థం చేసుకున్నారంటే కుదరదు. అందులోనూ ఎన్నికలు రెండేళ్లకు దగ్గరపడిన ఈ సమయంలో బొత్స వివరణలు మరింత గందరగోళానికి దారి తీస్తున్నాయి.