బొంగులో చికెన్ గురించి అందరికీ తెలిసిందే. మరి కొంగులో డ్రగ్స్ గురించి తెలుసా? బెంగళూరు పోలీసుల్ని అడిగితే ఈ విషయాన్ని పూసగుచ్చినట్టు చెబుతారు. డ్రగ్స్ దందాలో ఇదో కొత్త కోణం. చీర మడతల మధ్య డ్రగ్స్ ప్యాకెట్లు దాచి, సరిహద్దులు దాటించే పన్నాగాన్ని పోలీసులు ఛేదించారు.
బెంగళూరు ఇంటర్నేషనల్ కార్గోలో పెద్ద పార్శిల్ ఎగుమతికి సిద్ధంగా ఉంది. ఆ పార్శిల్ నిండా ఉన్నవి చీరలే. అన్ని చీరల్ని ఆస్ట్రేలియాకు ఎందుకు పంపిస్తున్నారో కస్టమ్స్ అధికారులకు అర్థం కాలేదు. ఏదో బిజినెస్ డీల్ అనుకున్నారు. అనుమతులు, పత్రాలు కూడా 'సక్రమం'గా వచ్చేశాయి.
ఇక కార్గోలో ఎగుమతి చేయడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో పోలీసులకు అనుమానం వచ్చింది. పార్శిల్ నుంచి ఓ చీర తీసుకొని మడతలు విప్పారు. ఇంకేముంది, అందులో డ్రగ్స్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. ఆ మాదకద్రవ్యాన్ని ఎఫిడ్రిన్ గా గుర్తించారు. ఒక్కో మడతలో చిన్న చిన్న ప్యాకెట్లు కనిపించాయి.
ఇలా ప్రతి చీరలో చిన్న చిన్న ప్యాకెట్లతో డ్రగ్స్ నింపారు. ఒకటి కాదు, రెండు కాదు, వందల ప్యాకెట్లు బయటపడ్డాయి. మొత్తం డ్రగ్స్ బరువు 5 కిలోలు. దీని విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు తేల్చారు.
బెంగళూరు తరహాలోనే తాజాగా విజయవాడలో డ్రగ్స్ దందా బయటపడిన సంగతి తెలిసిందే. తప్పుడు అడ్రెస్ తో డ్రగ్స్ ను ఆస్ట్రేలియాకు కొరియర్ చేయడానికి ప్రయత్నించారు కొంతమంది. ఆ కేసుకు, తాజాగా వెలుగుచూసిన బెంగళూరు డ్రగ్స్ కేసుకు లింకు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.