ఆమధ్య పవన్ కల్యాణ్ తో సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేశ్. పవన్ తో ఫొటో దిగి మరీ ఘనంగా ప్రకటన చేసిన ఈ నిర్మాత, ఇప్పుడా సినిమాపై మరోలా స్పందించాడు. పవన్ కల్యాణ్ తో తనకు సినిమా తీయాలని లేదని ప్రకటించాడు. దీనికి ఆయన రీజన్ కూడా చెప్పుకొచ్చాడు.
“పవన్ కల్యాణ్ తో సినిమా తీయకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఆయన తొందరగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఆయన సినిమాలు తీయకుండా తొందరగా రాజకీయాల వైపు వెళ్లి, ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను. పవన్ ముఖ్యమంత్రి అయితే నాకేదో పదవి వస్తుందనే ఆశ నాకు లేదు. నాకు ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు వద్దు.”
ఇది బండ్ల గణేశ్ లాజిక్. ఓవైపు ఇలా ప్రకటన చేస్తూనే, మరోవైపు పవన్ సినిమాల లైనప్ బాగుందని మెచ్చుకున్నాడు. ప్రస్తుతం పవన్ 2-3 మంచి సినిమాలు చేస్తున్నారని, అవి పూర్తయిన వెంటనే తన సినిమా ఉంటుందని ముక్తాయించాడు.
మరోవైపు ఓ అగ్ర దర్శకుడితో తనకున్న విబేధాలపై కూడా సెటైరిక్ గా స్పందించాడు బండ్ల. దర్శకులంతా నీళ్లలాంటి వాళ్లని, ఇలా వచ్చి అలా పోతారని, తను మాత్రం డ్యామ్ లాంటోడినని అభివర్ణించుకున్నారు.
“నేను నాగార్జునసాగర్ డ్యామ్ లాంటోడిని. డ్యామ్ లోకి నీరు వస్తుంటాయి, పోతుంటాయి. వాళ్లందరూ ఆ టైపు. నేను బ్యారేజీ లాంటోడ్ని. అక్కడే ఉంటాను. వాళ్లతో నాకు పోలికేంటి.”
మరో దర్శకుడు హరీష్ శంకర్ పై కూడా పరోక్షంగా విమర్శలు చేశాడు బండ్ల గణేష్. కృతజ్ఞత లేని వ్యక్తుల్ని తను మనుషులుగా కూడా చూడనని అన్నాడు. అన్నం పెట్టిన ప్రొడ్యూసర్ నే అవమానించేలా మాట్లాడితే కన్న తల్లికి ద్రోహం చేసినట్టు అవుతుందని పరోక్షంగా చురకలంటించాడు.