శత్రుఘ్నసిన్హా ఒకప్పటి హీరో, విలన్. లేటెస్ట్‌గా అసన్‌సోల్ (వెస్ట్ బెంగాల్) నుంచి ఉప ఎన్నికలో తృణమూల్ అభ్యర్థిగా ఎంపీగా గెలిచారు. అంతకు ముందు రెండుసార్లు పార్లమెంట్‌కి (పాట్నాసాహిబ్) రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. కేంద్రమంత్రిగా కూడా చేశారు. అయితే ఒకసారి రాజేష్‌ఖన్నా చేతిలో ఓడిపోయారు.
పాట్నాలో పుట్టిన సిన్హా పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి. 1969లో సాజన్ సినిమాలో చిన్నపాత్రతో పరిచయమయ్యాడు. తర్వాత విలన్, సపోర్టింగ్ యాక్టర్‌గా చేశాడు. 1976లో కాళీచరణ్‌తో సక్సెస్ హీరో అయ్యాడు. అంతకు మునుపు హీరోగా చేసినవి పెద్దగా ఆడలేదు.
కాళీచరణ్‌లో రాజేష్‌ఖన్నాని హీరోగా అనుకున్నారు. అయితే రెండేళ్లు ఆయన డేట్స్ లేవు. దాంతో అదృష్టం శత్రుకి దక్కింది. అప్పటి నుంచి రాజేష్‌ఖన్నా అంటే సిన్హాకి కృతజ్ఞత, భక్తి. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. కానీ రాజకీయాలు ఎంతటి వారినైనా విడదీస్తాయి.
1992లో న్యూఢిల్లీ ఉప ఎన్నిక వచ్చింది. ఎల్‌కే అద్వానీ సలహా మేరకు బీజేపీ అభ్యర్థిగా శత్రు నిలబడ్డాడు. కాంగ్రెస్ తరపున రాజేష్‌ఖన్నా. దీన్ని శత్రుఘ్నసిన్హా ఊహించలేదు. వెనక్కి వెళ్లలేని స్థితి. రాజేష్‌ఖన్నా 25 వేల మెజార్టీతో గెలిచాడు. ఆ తర్వాత సిన్హాతో జీవితాంతం మాట్లాడలేదు. సిన్హా క్షమాపణ చెప్పినా రాజేష్ పంతం వీడలేదు.
సిన్హాకి బైపాస్ సర్జరీ జరిగినప్పుడు రాజేష్ చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఆ స్థితిలో కూడా ఆఖరి సారి క్షమాపణ చెబుతానని కూతురు సోనాక్షితో చెప్పాడు. ఆరోగ్యరీత్యా అతను కదలడానికి ఎవరూ ఒప్పుకోలేదు. రాజేష్‌ఖన్నా చనిపోయాడు.
“నాకు జీవితాన్ని ఇచ్చిన రాజేష్‌ఖన్నాకి వ్యతిరేకంగా పోటీ చేయడం నేను చేసిన పెద్ద తప్పు” అని చాలా ఇంటర్వ్యూల్లో సిన్హా చెప్పాడు.
మోదీతో విభేదించి మొన్న ఎన్నికల్లో గెలిచారు. బాలీవుడ్‌కి చెందిన ఒక్కరు కూడా శత్రుఘ్నసిన్హాకి అభినందనలు చెప్పలేదు. మోదీ అంటే అంత భయం మరి!
జీఆర్ మహర్షి