గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో వెండితెర అగ్రహీరో, జనసేనాని పవన్‌కల్యాణ్ జీరో అయ్యారు. ఇదే ఎన్నికల్లో తిరుగులేని విజయంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ తెరపై హీరో అయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో 3 వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్రగా నడిచి ఏపీ ప్రజల అభిమానాన్నిచూరగొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ “నేను విన్నాను, నేను ఉన్నాను” అనే నినాదంతో జనానికి భరోసా కల్పించారు. ఈ నినాదం ఏపీ అంతటా ప్రతిధ్వనించింది. జగన్ అధికారంలోకి రావడానికి అస్త్రంలా పని చేసింది.
ఈ నినాదం మూడేళ్లకు వెండితెరకెక్కడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన సర్కార్ వారి పాట మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో మహేష్‌బాబు ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అని పొలిటికల్ డైలాగ్ చెప్పారు.
మహేష్‌బాబు అభిమానులతో పాటు వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఫిదా అయ్యారు. తమ అభిమాన నాయకుడి ఎన్నికల నినాదాన్ని సినిమాలో ఉపయోగించుకోవడం జగన్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.
సినిమా టికెట్ల ధరలు, ఇతర సినీ సమస్యలపై చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి తదితర సెలబ్రిటీలతో కలిసి సీఎం జగన్‌ను మహేష్‌బాబు కలుసుకున్న సంగతి తెలిసిందే. జగన్‌తో భేటీ తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని మహేష్‌బాబు చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తన సినిమాలో జగన్ ఎన్నికల నినాదాన్నే డైలాగ్ చెప్పి వైసీపీ అభిమానులు, జగన్ ప్రేమను మహేష్ దక్కించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా వుండగా సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబంతో వైఎస్సార్ కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలున్నాయి. వైఎస్సార్ మరణానంతరం కూడా ఆ సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఇందుకు తన సినిమాలో జగన్ పొలిటికల్ డైలాగ్‌ను మహేష్‌బాబు వాడుకోవడమే నిదర్శనమని అంటున్నారు.