హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యల కేసు కొలిక్కి వచ్చింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. ముఖ్యంగా ఈ కేసులో హతురాలు జ్యోతి భర్త శ్రీనివాసరావే నిందితుడు కావడం చర్చనీయాంశమైంది.
రెండు రోజుల క్రితం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జంట హత్యలు కలకలం రేపాయి. హతుల్లో పురుషుడు, మహిళ ఉండడంతో ప్రేమ సంబంధ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అనుమానమే నిజమైంది. హైదరాబాద్‌లోని వారాసిగూడ నివాసి యెడ్ల యశ్వంత్(22) క్యాబ్ డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన జ్యోతి(28)అనే వివాహితతో అతనికి పరిచయం ఏర్పడింది. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. జ్యోతి వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకోవడంపై భర్త శ్రీనివాసరావు జీర్ణించుకోలేకపోయాడు. కొంత కాలంగా భార్య నడవడికపై నిఘా పెట్టాడు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో యశ్వంత్, జ్యోతి ఏకాంతంలో ఉండగా శ్రీనివాసరావు, మరో నలుగురితో కలిసి దాడికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.
బ్రిడ్జి కింద మృతదేహాలు పడి వుండడంతో మొదట ఆత్మహత్యగా పోలీసులు భావించారు. అయితే మృతుల శరీరాలపై గాయాలు ఉండడంతో హత్యగా అనుమానించారు. జ్యోతి భర్త శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి. భార్య వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేకే ఇద్దరినీ అంతమొందించినట్టు నిందితుడైన శ్రీనివాసరావు వెల్లడించినట్టు తెలిసింది. జంట హత్యల కేసులో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.