ఎక్కడ ఉత్తరాంధ్రా. మరెక్కడ ఉమ్మడి ఏపీ రాజధాని హైదరాబాద్. ఇక శ్రీకాకుళం వంటి వెనకబడిన జిల్లా. వీటికి లింక్ కుదురుతుందా. ప్రతిభ ఉంటే కుదురుతుంది. అందుకే సీనియర్ మోస్ట్ లీడర్ జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి సీఎం అయ్యారు. అలాగే చక్కగా పనిచేసి మంచి సీఎం గా పేరు తెచ్చుకున్నారు.
ఇక కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అదే విధంగా పీసీసీ చీఫ్ గా కూడా వ్యవహరించారు. ఒక విధంగా చెప్పుకుంటే కాంగ్రెస్ రాజకీయాల్లో జలగం వారిది ఒక శకంగా పేర్కొనాలి. మరి అన్ని రకాలుగా రాజకీయంగా రాణించిన జలగం సొంత జిల్లా అంటే ఖమ్మం అనుకుంటారు ఈ రోజుకీ.
కానీ ఆయనది అచ్చమైన శ్రీకాకుళం జిల్లా. రాజాం దగ్గర ఉన్న సోపేరు అన్న చిన్న ఊరులో జలగం ఇప్పటికి వందేళ్ల క్రితం పుట్టారు. ఆయన శత జయంతి ఉత్సవాలను అందుకే శ్రీకాకుళం జిల్లా ఘనంగా నిర్వహించుకుంటోంది. ఇక ఈ ఉత్సవాలకు హాజరైన రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు జలగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఐఏఎస్ లు మెచ్చిన బెస్ట్ సీఎం ఆయన అని కొనియాడారు. జలగం ఉమ్మడి ఏపీలో ఎన్నో సాగు నీటి ప్రాజెక్టులకు ప్రాణ ప్రతిష్ట చేశారు అని కూడా పేర్కొన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో జలగం వెంగళరావు విగ్రహంతో పాటు, ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పేరు పెడతామని ధర్మాన పేర్కొన్నారు.
మొత్తానికి 1970, 80 దశకాలలో జలగం ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు అని చెప్పకతప్పదు.