మనవన్నీ ఎక్కువగా హీరో ఓరియెంటెడ్ సినిమాలు కనుక, హీరోచిత పోరాటం అనే పదం బాగా పాపులర్ అయింది. యాంకర్ సుమ కూడా అందుకు తీసిపోకుండా తను నటించిన జయమ్మ పంచాయతీ సినిమా కోసం ఆ లెవెల్ పోరాటం లాంటి ప్రచారమే సాగిస్తోంది.
నిజానికి ఆ సినిమాలో సుమ కాకుండా మరెవరు నటించినా, పాపులర్ హీరోయిన్ నటించినా ఈ రేంజ్ ప్రచారం అయితే జరిగేది కాదు. మహా అయితే పర్యటనలు, ప్రచారాలు మామూలే కానీ, ఖర్చుకు అదనంగా పలుకబడితో జరిగే ప్రచారం మాత్రం జరిగి వుండేది కాదు.
ఈ సినిమా కోసం సుమ సినిమా రంగంతో తనకు వున్న స్నేహాలు, పరిచయాలు అన్నీ ఉపయోగించి మరీ ప్రచారం సాగిస్తోంది. రాఘవేంద్రరావు, రాజమౌళి, నాని, నాగ్ లతో పాటు ఆఖరికి ఈ రోజున మహేష్ బాబు ను కూడా ట్రయిలర్ విడుదలకు ఓకె అనేలా చేసింది. ఇదంతా సుమ కోసమే. ఇన్నాళ్లుగా ఆమె చేసిన సినిమా ఫంక్షన్ల ఫలితం ఇది.
ఓ చిన్న సినిమా, అది కూడా ఎక్కువగా లోకల్ యాక్టర్లు నటించిన సినిమాను, సుమ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన సినిమా లెవెల్ కు చేర్చింది. అటు విష్వక్ సేన్, ఇటు శ్రీవిష్ణు సినిమాలతో పోటీ పడేలా చేసింది.
సుమ కు లేడీస్ లో ఫాలోయింగ్ గట్టిగానే వుంది. మరి ఆ ఫాలోయింగ్ టికెట్ లు తెగేలా చేస్తుందా అన్నది చూడాలి. ఒక విధంగా ఎప్పుడో దాసరి టైమ్ లో హీరోయిన్ గా సినిమా ప్రపంచం గురించి తెలియని రోజుల్లో ట్రయ్ చేసారు సుమ. ఇప్పుడు ఇన్నేళ్ల గ్యాప్ తరువాత ఈ రంగం గురించి క్షుణ్ణంగా తెలిసిన తరువాత మలి ప్రయత్నం చేస్తున్నారు.
మరి ఈసారి అదృష్టం ఎలా వుందో చూడాలి.